ట్రిపుల్ వన్ జీవోలోని బాకారంలో డ్రీమ్ వ్యాలీ అక్రమంగా విల్లాల్ని కడుతున్నారని సాక్షాత్తు రెవెన్యూ శాఖ నిర్థారించినా.. హెచ్ఎండీఏ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆయా విల్లాల్ని కూల్చివేయడానికి తమ వద్ద సిబ్బంది కానీ యంత్రపరికరాలు కానీ లేవని.. అధికారికంగా సమాధానమిచ్చినా.. స్పందించట్లేదు. అసలు బాకారం రెవెన్యూ సెక్రటరీ పంపిన నివేదిక తమ వద్దకు చేరలేదని హెచ్ఎండీఏ చెబుతున్నదని సమాచారం. మరి, రంగారెడ్డి ప్రస్తుత కలెక్టర్ డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాల గురించి హెచ్ఎండీఏకు సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చినా, హెచ్ఎండీఏ పట్టించుకోవట్లేదా? అయితే, డ్రీమ్ వ్యాలీకి సంబంధించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
డ్రీమ్ వ్యాలీ యజమాని కంచర్ల సంతోష్‌రెడ్డి కాంగ్రెస్‌లోని ఒకరిద్దరు మంత్రులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇమాజిన్ విల్లాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఏకంగా వారికి విల్లాలను ఉచితంగా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అందుకే, ప్రభుత్వంలోని సదరు పెద్దలు.. డ్రీమ్ విల్లాలపై ఎలాంటి చర్యల్ని తీసుకోవద్దని అనధికార ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరి, ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత దుర్మార్గమని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేసే ప్రయత్నం చేసినందుకు.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, సోమేష్‌కుమార్, అరవింద్ కుమార్‌లను.. అమరవీరుల స్థూపం వద్ద గుంజకు పాతేసి శిక్షించాలని ఆవేశంతో ఊగిపోయారు. మరి, పర్యావరణంపై అంత మక్కువ గల సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా.. ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు ఎలా వ్యవహరిస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ట్రిపుల్ వన్ జీవోలో నిర్మిస్తున్న డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాల్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డ్రీమ్‌వ్యాలీ అక్రమ విల్లాల గురించి సాక్షాత్తూ ప్రభుత్వానికి తెలిసినా.. అందులో విల్లాల్ని కొన్నవారు మాత్రం.. ఇంటీరియర్స్ పనుల్ని యధావిధిగా కొనసాగిస్తున్నారని సమాచారం. జంటజలాశయాల్ని మురుగు కాసారంగా మారిపోయినా ఫర్వాలేదు.. మరో రెండు హుస్సేన్ సాగర్లు అయినా ఫర్వాలేదు.. తాము మాత్రం విశాలమైన విల్లాల్ని కట్టుకుంటామని భావించే విల్లా ఓనర్ల మీద కూడా.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
This website uses cookies.