అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయించింది. ఈ క్రమంలో జోనల్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. తాజగా వ్యక్తిగత ఇల్లు కట్టేవారైనా.. బిల్డర్లయినా.. తప్పనిసరిగా బిల్డర్ పర్మిట్ నిబంధనల్ని సైటు వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంటే, ఆయా అపార్టుమెంటును కొనడానికి ఎవరొచ్చినా.. స్థానిక సంస్థ ఎన్ని అంతస్తులకు అనుమతినిచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానిది తోడ్పడుతుంది.
ఎవరైనా అనుమతికి విరుద్ధంగా నిర్మాణాల్ని కడుతున్నా.. కొనుగోలుదారులకు తెలిసిపోతుంది. వాస్తవానికి, దరఖాస్తుదారునికి జారీ చేసిన బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్‌లో కూడా ఈ షరతు గురించి పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం చాలామంది బిల్డర్లు.. సైటు వద్ద బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడం లేదని తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. “మంజూరు చేసిన ప్రణాళికను ప్రదర్శించకుండా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామ”ని జీహెచ్ఎంసీ పేర్కొంది.