Categories: LEGAL

ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూపు

  • నోయిడాలో ఆమోర్ అపార్ట్ మెంట్ బయర్ల పాట్లు

సొంతింటి కోసం కష్టపడి దాచుకున్న మొత్తమంతా చెల్లించి ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్నా వారి కల నెరవేరలేదు. తమ ఫ్లాట్ల కోసం కంపెనీ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోవడంతో చివరకు రోడ్డెక్కారు. వెంటనే తమ ఫ్లాట్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. నోయిడాలోని ఆమోర్ అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు కొన్నవారి దుస్థితి ఇది.

వేవ్ గ్రూప్ 2011-12లో నోయిడాలోని 28ఏ, 32 సెక్టార్లలో వేవ్ మెగా సిటీ సెంటర్ పేరుతో ఓ ప్రాజెక్టు లాంచ్ చేసింది. 2014 నాటికి ఫ్లాట్లు అప్పగిస్తామని పేర్కొంది. మొత్తం 780 ఫ్లాట్లు ఉండగా.. 480 ఫ్లాట్లను పలువురు కొనుగోలు చేశారు. కానీ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. వాస్తవ అప్పగింత తేదీ నుంచి ఎనిమిదేళ్లు గడిచిపోయినా కొనుగోలుదారులకు ఫ్లాట్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో గతేడాది మార్చిలో వేవ్ మెగా సిటీ సెంటర్ ప్రైవేటు లిమిటెడ్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కొనుగోలుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా నోయిడాలో రోడ్డెక్కి కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేశారు.

రూ.కోటికి పైగా చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్నామని, పదేళ్లు గడిచిపోయినా ఇంకా ఫ్లాట్ ఇవ్వలేదని, అటు ఈఎంఐ, ఇటు ఇంటి అద్దె కట్టుకోవడం తలకు మించిన భారంగా ఉందని పలువురు వాపోతున్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా.. ప్రస్తుతం ఈ కేసు లా ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్నందున ఏమీ మాట్లాడబోమని పేర్కొన్నారు. నోయిడా అథార్టీ చేసిన అసాధ్యమైన డిమాండ్ కారణంగానే ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని వివరించారు.

ప్రాజెక్టును అథార్టీ సీల్ చేయడంలో కంపెనీకి మరో మార్గం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు లా ట్రిబ్యునల్ కు వెళ్లినట్టు తెలిపారు. దాదాపు 2,700 కోట్ల బకాయిలను చెల్లించడంలో వేవ్ గ్రూప్ విఫలం కావడంతో 2017లో 4.5 మిలియన్ చరదపు అడుగుల భూమిని నోయిడా అథార్టీ స్వాధీనం చేసుకుంది. అనంతరం గతేడాది ఫిబ్రవరిలో మరో మిలియన్ చదరపు అడుగుల భూమి కేటాయింపును రద్దు చేసింది. దీంతో అందులో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు కొనుక్కునేవారు.. తెలివిగా వ్యవహరించకపోతే నొయిడా మాదిరిగానే నిర్మాణ రంగం ఇక్కడ కూడా దారుణంగా దెబ్బతింటుంది. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి సొమ్ము కట్టినవారు.. అందులోకి ప్రవేశించడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

This website uses cookies.