Categories: TOP STORIES

దుబాయ్ లో ఫ్లాట్ కొంటున్నారా?

ఫెమా నిబంధనల గురించి తెలుసుకోండి

దుబాయ్ లో ఫ్లాట్ కొంటున్నారా? అయితే, ఫెమా నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇటీవల కాలంలో దుబాయ్ బిల్డర్లు తరచుగా రియల్ ఎస్టేట్ ఫెయిర్స్ నిర్వహించడం, సులభమైన పేమెంట్ అవకాశాలు కల్పిస్తుండటం, ప్రాపర్టీ యాడ్స్ విపరీతంగా ఇస్తుండటంతో పలువురు దుబాయ్ లో ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. చాలామంది ఎన్నారైలు ప్రాపర్టీ విలువలో 15 శాతం నుంచి 20 శాతం చెల్లించి మిగిలిన మొత్తాన్ని 4 నుంచి 8 సంవత్సరాల్లో ఈఎంఐలు కింద చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తద్వారా తమకు తెలియకుండా ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాలలో ఇంటి కొనుగోలు నిమిత్తం 2.50 లక్షల డాలర్లు వెచ్చించొచ్చు. అదే పెద్ద ఇల్లు కొనాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ 2.50 లక్షల డాలర్ల చొప్పున (ఏడాదికి) వెచ్చించొచ్చు. అదే వాయిదా పద్ధతుల్లో కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు అవుతుంది. ‘యూఏఈ ప్రాపర్టీ ప్రకటనలు మీకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. కొందరు భారతీయులు ఫెమా చట్టానికి వ్యతిరేకంగా అందులో చిక్కుకునే ప్రమాదం ఉంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా భారతీయులు దేశానికి వెలుపు ఎలాంటి ప్రాపర్టీ లావాదేవీలు జరపకూడదు’ అని నిపుణులు చెబుతున్నారు.

అప్పు చేసిన సొమ్ముతో విదేశాలలో ప్రాపర్టీలు కొనడం చట్టబద్ధం కాదు. స్థానిక బ్యాంకు నుంచి లేదా విదేశాలకు చెందిన రుణదాతల నుంచి అప్పు తీసుకుని కొనుగోలు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇక్కడ సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించొచ్చంటూ చేస్తున్న ప్రచారం అంతిమంగా అప్పు కిందకే వస్తుంది. భారతదేశంలో నివసించే భారతీయులకు విదేశాలలో ఫైనాన్సింగ్ చేయడానికి అనుమతి లేదు. అయితే, ఇవి రెడీ టూ మూవ్ ప్రాపర్టీలకే వర్తిస్తాయని.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో సమస్య లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫెమా కన్సల్టెంట్ చెప్పారు. కానీ బిల్డర్లతో ఒప్పందం చేసుకునేటప్పుడు అందులోని భాషను, అర్థాన్ని కచ్చితంగా పరిశీలించాలని సూచించారు.

భారతీయులే అధికం..

గతేడాది దుబాయ్ లో ప్రాపర్టీ కొన్నవారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. కనీసం రెండు త్రైమాసికాల్లో మనోళ్లు బ్రిటిషర్లను అధిగమించారు. 2020 నుంచి 2023 మధ్యకాలంలో యూఏఈ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు ఏకంగా 2 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రాపర్టీ రేట్లు ముంబై కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో చాలామంది భారతీయులకు అది ఒక గొప్ప పెట్టుబడి అవకాశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ డెవలపర్లు సైతం భారత్ లోని సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ప్రాపర్టీ విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద చెల్లించి.. మిగిలింది ప్రతినెలా ఒక శాతం చొప్పున చెల్లించేలా ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనలను, ఇండియన్ ఫారెక్స్ రెగ్యులేషన్స్ పట్ల ప్రాపర్టీ కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్ట విలువ దాటిన ప్రాపర్టీలో పెట్టుబడులు పెడుతున్న వ్యక్తులు యూఏఈలో గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసేందుకు అర్హులవుతారు. ఇటీవల సడలించిన గోల్డెన్ వీసా నిబంధన కింద ప్రాపర్టీ కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని దరఖాస్తుదారుడు రుణంగా తీసుకునే వీలు కల్పిస్తోంది. కాగా, విదేశాలలో వాయిదాల పద్ధతిలో స్తిరాస్థిని కొనుగోలు చేయడానికి అనుమతి ఉందా లేదా అనేదానిపై ఆర్బీఐ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ప్రాపర్టీని కొనుగోలు చేయడం అనుమతింపదగిన మూలధన ఖాతా లావాదేవీ అయినప్పటికీ, ఫెమా నిబంధనల ప్రకారం వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయడం నిషేధమని నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies.