Categories: LEGAL

ఫ్లాటు కొంటున్నారా? ఈ విషయాల్ని తెలుసుకోవాలి.. అవేమిటంటే??

స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ల నిర్మాణంలో అధిక శాతం బిల్డర్లు కొనుగోలుదారుల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. నిబంధనల ప్రకారం నిర్మించనే నిర్మించరు. నిర్మాణ పనులు జరిగేంత వరకూ అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడని కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులు.. నిర్మాణం పూర్తి కాగానే కొన్నవారి ముందు ప్రత్యక్షమవుతారు.

కొన్ని సందర్భాల్లో నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం వద్దే అసలు పేచీ వస్తుంది. నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట్, నార్సింగి, పొప్పాల్ గూడ వంటి ప్రాంతాల్లో ఉన్నన్నీ అక్రమ నిర్మాణాలు ఎక్కడా లేవంటి నమ్మండి. అందుకే, ఫ్లాటు కొన్నతర్వాత మీరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదంటే న్యాయ‌ప‌ర‌మైన‌ కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాలి. అవేమిటంటే..

  • స్థలం, అనుమతులు, ప్లాన్లకు సంబంధించిన పత్రాలన్నింటినీ అనుభవజ్ఞుడైన న్యాయవాది చేత పరిశీలింపజేయాలి.
  • వీలైనంత వరకూ టైటిల్, ప్రభుత్వ అనుమతులకు సంబంధించి అన్ని ఒరిజినల్ పత్రాలు తీసుకోండి. ఇంటి స్థలం ఎవరి పేరు మీద ఉంది? బిల్డర్ పేరు మీదా? లేక యజమాని పేరు మీదా అనే అంశాన్ని కనుక్కోండి. ఒకవేళ ప్రతినిధి అయితే ఫ్లాటు అమ్మి, రిజిస్టర్ చేసే అధికారం అతనికి ఉందా? లేదా? వంటి విషయాల్ని కనుక్కోవాలి.
  • బిల్డరే స్వయంగా స్థలం కొని అపార్టుమెంట్ నిర్మిస్తున్నాడా? లేక వేరే స్థల యజమాని వద్ద డెవలప్మెంట్ కు తీసుకున్నాడా? ఒకవేళ డెవలప్మెంట్ అయితే, వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందాన్ని పరిశీలించాలి. స్థలం సరిహద్దుల్ని సరిపోల్చుకోవాలి. సాధారణంగా ఎక్కువ శాతం వివాదాలు సరిహద్దుల వల్లే తలెత్తుతుంటాయి.
  • ప్రభుత్వ స్థలాల్లోనూ అపార్టుమెంట్లను కట్టే ప్రబుద్ధులు కొందరు లేకపోలేరు. ఈ ప్రమాదం తప్పాలంటే.. ఆ స్థలానికి సంబంధించిన కలెక్టర్ నుంచి ఎన్వోసీ ఉందో లేదో తెలుసుకోవాలి.
  • ఊరికే బిల్డర్ ఇచ్చిన ప్లానుతో సరిపెట్టుకోవద్దు. కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ ఇచ్చిన ప్లాన్ కు భిన్నమైన దాన్ని మీకు చూపించి బుట్టలో పడేసే ప్రమాదం లేకపోలేదు. ఆమోదిత ప్లాన్ ప్రకారం ఎన్ని ఫ్లోర్లు కట్టొచ్చనే విషయాన్ని పరిశీలించండి.
  • పార్కింగ్, టెర్రస్, ఓపెన్ స్పేస్ వంటి కామన్ ఏరియాకు సంబంధించిన వివరాల్ని ముందే తెలుసుకోవాలి.
  • అగ్రిమెంట్ ప్రకారమే అపార్టుమెంట్ కడుతున్నారా? లేదా వంటి విషయాల్ని ఓ కంట కనిపెడుతుండాలి.
  • అక్రమ నిర్మాణం జరిగేంత వరకూ ప్రేక్షక పాత్ర వహించే అధికారులు.. బిల్డర్లు తమ పని ముగించుకుని వెళ్లిపోయిన తర్వాతే ప్రత్యక్షం అవుతారు. అనుమతి లేకుండా ఎలాంటి కనెక్షన్ ఉన్నా తొలగిస్తామని బెదిరిస్తుంటారు. అప్పుడు మీకు తలపోటే కాదు.. ఖర్చుల భారమూ మీద పడుతుంది.
  • ఫ్లాట్ స్వాధీనం చేసుకునేటప్పుడు అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం బిల్టప్ ఏరియా ఉందా? లేదా? అనే అంశాన్ని నిర్థారించుకోవాలి.

This website uses cookies.