Categories: LEGAL

ఫ్లాటు కొంటున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నేటికీ ప్రీలాంచుల‌ను విక్ర‌యించే సంస్థ‌లు ఉండ‌ట‌మే కాదు.. అందులో కొనేవారూ ఉన్నారు. మోస‌పూరిత డెవ‌ల‌ప‌ర్లను న‌మ్మినంత కాలం ప్రీలాంచుల్లో కొన్న‌వారు మోస‌పోతూనే ఉంటార‌ని గుర్తుంచుకోండి. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా స్థిరాస్తి కొనుగోలు విష‌యంలో తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. లేక‌పోతే, మీ క‌ష్టార్జితం కాస్త క‌రోనా బిల్డ‌ర్ల పాలిట అవుతుంది.

రోజు రోజుకు భూముల ధరలు పెరిగిపోవడంతో అదే స్థాయిలో మోసాలు పెరిపోయాయి. సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో తొందరపడి కొంత మంది చేతిలో మోసపోతున్నారు చాలా మంది. అందుకే ఇంటి స్థలం నుంచి మొదలు అపార్ట్ మెంట్, ఇల్లు ఏది కొనాలన్నా ముందుగా చాలా అంశాలను బేరీజు వేసుకుని మాత్రమే ముందడుగు వేయాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇంటి స్థలం, అపార్ట్ మెంట్ లో ఫ్లాట్, విల్లా ఏది కొనాలన్నా ముందు ఆ ప్రాజెక్టు రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీలో నమోదైందా అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం www.rerait.telangana.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి మీరు కొనాలనుకున్న వెంచర్ అందులో రిజిస్టర్ అయితేనే మీరు కొనుగోలు చేయాలి.

  • ఇంటి స్థలం, అపార్టుమెంట్ లో ఫ్లాట్‌, ఇల్లు కొనేముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలి. యాజమాన్య హక్కులు పరిశీలించడానికి అన్ని లింకు డాక్యుమెంట్లలోనూ ఆస్తి సర్వే నంబరు, సరిహద్దుల పరంగా ఒకేలా ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కనీసం 30 ఏళ్లకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ను పరిశీలించాలి.
  • ఇంటి స్థలం, అపార్ట్ మెంట్, విల్లా ప్రాజెక్టుకు సంబందించిన లే అవుట్‌ మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ లాంటి సంస్థల పర్మిషన్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.
  • మీరు కొనాలనుకున్న‌ ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్ మెంట్ నిర్మించే భూమి రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 సెక్షన్‌ 22ఎ క్రింద, ప్రభుత్వం చేసిన ఇతర చట్టాల కింద నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి.
  • క్షేత్రస్థాయిలో ఆస్తిని భౌతికంగా చూసి, పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలి. అపార్ట్ మెంట్ లేదా విల్లా నిర్మాణం అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం సైట్‌ ప్లాన్‌, లొకేషన్‌ హద్దులు ఉన్నాయా అనేదానిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. ఇల్లు లేదా అపార్ట్ మెంట్ ప్లాన్‌ ప్రకారం నిర్మించకపోతే.. ఎప్పుడైనా మున్సిపాలిటీ అధికారులు కూల్చేయవచ్చు.

డెవ‌ల‌ప‌ర్ గ‌త చ‌రిత్ర‌?

రాత్రికి రాత్రే డ‌బ్బ‌లు సంపాదించాల‌న్న యావ‌తో చాలామంది క‌రోనా బిల్డ‌ర్లు హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలోకి అడుగుపెట్టారు. డాక్ట‌ర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, స్టీలు సిమెంటు వ్యాపారులు, మేస్త్రీలు, బ్రోక‌ర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తిఒక్క‌రూ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. వీరికి ఎలాంటి అనుభ‌వం లేకుండానే ఈ రంగంలోకి అడుగుపెట్టారు. కాబ‌ట్టి, మీరు ఫ్లాటు కొనేట‌ప్పుడు డెవ‌ల‌ప‌ర్ గ‌త చ‌రిత్ర త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

  • మీ డెవ‌ల‌ప‌ర్ పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు తెలుసుకోవడంతో పాటు అందులో అప్పటికే కొన్న కస్టమర్లతో మాట్లాడాలి. సదరు డెవలపర్ కు సంబందించిన పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లలో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయా అన్న విషయాలను కనుక్కోవాలి. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక కస్టమర్లతో బిల్డర్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో అన్నకోణంలోను ఆరా తీయాలి. నిర్మాణ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తాడా లేదా తనిఖీ చేసుకోవాలి. బ్రోచర్‌లో ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తాడా లేదా అన్నది నిర్దారించుకోవాలి. అవసరమైతే ప్రాజెక్ట్‌ రుణాలు, పాత లోన్ల రీపేమెంట్‌ గురించి ఆరా తీయాలి.

This website uses cookies.