నిర్మాణ పరిశ్రమ అనేది ఉపాధి కల్పించే అతిపెద్ద రంగాల్లో ఒకటి. ప్రపంచ నిర్మాణ పరిశ్రమ 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు, భారతదేశంలో 2025 నాటికి 1.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసిన నేపథ్యంలో నైపుణ్యం కలిగిన సివిల్ ఇంజనీర్లు, మేనేజర్ల అవసరం భారీగా ఉంది. అయితే, ప్రస్తుత విశ్వవిద్యాలయ వ్యవస్థ, సివిల్ పరిశ్రమలో అనేక కారణాల వల్ల ఈ రంగం ప్రతిభావంతమైన ఇంజనీర్లు, ఇతర వ్యక్తులను ఆకర్షించలేకపోతుంది. ప్రతిభావంతమైన ఇంజనీర్లు లేకపోవడం వల్ల నిర్మాణ ప్రాజెక్టుల ఉత్పాదకత, నాణ్యత, మొత్తం పరిశ్రమ జీవనోపాధిపైనే తీవ్రమైన పరిణామాలు చూపిస్తుంది.
నిర్మాణ రంగం విస్తారమైన కెరీర్ లేదా ఎంటర్ ప్రెన్యూరల్ అవకాశాలు కలిగిన రంగం అయినప్పటికీ, సివిల్ ఇంజనీరింగ్ విద్యను ఎంచుకోవడానికి తల్లిదండ్రులు, వారి పిల్లల్లో నిరాసక్తత ఉంది. కష్టమైన పని వాతవరణం, ప్రాథమిక స్థాయిలో తక్కువ జీతాలే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఆకర్షణీయమైన జీతాలు, పని వాతావరణం కారణంగా ఐటీ రంగం వైపు ఎక్కువ మంది వెళుతున్నారు. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో అడ్మిషన్లు నానాటికీ తగ్గిపోతున్నాయి. తెలంగాణలో ఎంసెట్ కన్వీనర్ కోటా కింద బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు గణణీయంగా తగ్గిపోయాయి.
2017-18లో 8389 కన్వీనర్ సీట్లకు గానూ 6240 సీట్లు (74.4 శాతం) భర్తీ కాగా.. 2021-22లో 6243 సీట్లకు గానూ 2365 సీట్లు (37.9 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. నాలుగేళ్లలో కన్వీనర్ సీట్లలో 8389 నుంచి 6243 సీట్లకు తగ్గడమే కాకుండా అడ్మిషన్ల శాతం కూడా 74.4 శాతం నుంచి 37.9 శాతానికి తగ్గాయి. మెరుగైన కెరీర్, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది ఇతర రంగ ఉద్యోగాలకు వలస వెళ్తున్నందున సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల శాతం తగ్గుతోంది. నిట్, ఐఐటీ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల వంటి అగ్రశ్రేణి సంస్థలకు చెందిన అనధికారికి గణాంకాల ప్రకారం 15 శాతం నుంచి 25 శాతం మంది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే నిర్మాణ పరిశ్రమ ఉద్యోగాల్లో చేరారు. మిగిలినవారంతా మెరుగైన జీతం ప్యాకేజీల కోసం ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాల వైపు ఇష్టపడతారు.
ఈ పరిస్థితికి వర్సిటీలు, నిర్మాణ సంఘాలే బాధ్యత వహించాలి. సివిల్ ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లో అధునాతన నిర్మాణ సాంకేతికతలను స్వీకరించడానికి వర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితంగా ప్రస్తుత పరిశ్రమకు అనుగుణంగా లేని సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు. మరోవైపు వర్సిటీల నుంచి బయటకు వచ్చే సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పనికి సంబంధించిన ప్రాక్టికల్ పరిజ్ఞానం, నైపుణ్యాలు లేవనే సాకుతో ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాలతో సమానంగా ఆకర్షణీయమైన వేతనాలు అందించడానికి నిర్మాణ రంగం ముందుకు రావట్లేదు. ఇంకోవైపు ఇతర రంగాల్లో కొత్తగా రిక్రూట్ మెంట్ చేసుకునేవారికి శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయా రంగాలు గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తున్నాయి. కానీ నిర్మాణ రంగంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుల నిర్వహణకు ప్రతిభావంతులైన మానవ వనరులు లేకపోవడం వల్ల నిర్మాణ పరిశ్రమ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సివిల్ ఇంజనీర్లు వెన్నెముక అని, ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని అధిగమించడానికి తగిన చర్యలు అవసరమని పేర్కొంటున్నారు.
This website uses cookies.