– కలెక్టర్లకు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశం
రాష్ట్రంలోని ప్రైవేటు భూములు 22 ఏ(నిషిద్ధ) భూమూల రిజిస్టర్ లో ఉండకూడదని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టంచేశారు. ప్రజలకు భూమి అనేది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారమని.. తమ భూములతో వారు దీర్ఘకాలిక బంధాన్ని కలిగి ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకే వ్యక్తుల భూములపై హక్కులను కాపాడటం ప్రభుత్వ విధి అని.. ఈ నేపథ్యంలో ప్రైవేటు భూములు 22ఏలో ఉంచడం సరికాదని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. సామాన్య ప్రజల బాధలకు ముగింపు పలికేలా అలాంటి భూములన్నింటినీ 22 ఏ జాబితా నుంచి వెంటనే తొలగించాలని కోరారు. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేయడంతోపాటు ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని, ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. భూ వ్యాజ్యాల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి డీఆర్వోలకు బదులుగా ఆర్డీవోలను అప్పిలేట్ అథార్టీగా చేయడానికి ఆర్వోఆర్ చట్టాన్ని సవరించినట్టు వివరించారు. అలాగే రాష్ట్రంలో అన్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్న పేదలకు ఆ భూమిని క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని కూడా తమ ప్రభుత్వం చేపడుతోందని సత్యప్రసాద్ తెలిపారు. గత వైఎస్సార్ సీపీ నిర్వహించిన రీసర్వే తప్పుల తడకగా ఉందని.. తమ సర్కారు రోజుకు 20 ఎకరాలు మాత్రమే తీసుకుని పారదర్శకంగా సర్వే నిర్వహిస్తోందని వెల్లడించారు. రియల్టర్ల సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖలు, బ్యాంకర్లతో ప్రత్యేక రియల్ ఎస్టేట్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
This website uses cookies.