Categories: Rera

ఫ్లాట్ స్వాధీనం తర్వాత ఆలస్యపు పరిహారం పొందొచ్చా?

రెరా చట్టం ఏం చెబుతోందంటే..

సాధారణంగా కొంతమంది డెవలపర్లు గడువులోగా ఫ్లాట్ అప్పగించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అప్పగింత ఆలస్యమైనందుకు డెవలపర్ నుంచి పరిహారం పొందే వెసులుబాటును రెరా చట్టం కల్పించింది. అయితే, ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆలస్యపు పరిహారం పొందే వీలు లేదన్న సంగతి కొనుగోలుదారులు గమనించాలి. రెరా చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఫిర్యాదు చేసేటప్పుడు ఉల్లంఘన జరిగి ఉండాలి. అప్పుడే పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు దాఖలు చేసే సమయం నాటికి జాప్యం కొనసాగుతూ ఉంటేనే, డెవలపర్ నుంచి రెరా చట్టం (పరిహారం) సెక్షన్ 18 కింద పరిహారం పొందే వీలుంటుంది. దీనికి సంబంధించి ఇటీవల మహారాష్ట్ర రెరా ఓ కేసును పరిష్కరించింది.

గిరీష్ భోయిట్ అనే వ్యక్తి పుణెలోని పరంజ్ పే స్కీమ్స్ కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ నుంచి 2015లో రూ.50 లక్షలకు ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం 2019 మార్చి నాటికి దానిని స్వాధీనం చేయాలి. అయితే, కొనుగోలుదారు ఆ ప్రాపర్టీని 2022 మేలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆలస్యమైన కాలానికి గానూ పరిహారం ఇప్పించాలని కోరుతూ మహారాష్ట్ర రెరాలో ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఫిర్యాదు చేసినందున అది విచారణార్హం కాదని డెవలపర్ వాదించారు. పర్యావరణ అనుమతులు రావడం ఆలస్యం కారణంగా జాప్యం జరిగిందని, అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఇందుకు మరో కారణమని నివేదించారు. 2021 ఏప్రిల్ లో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందానని, అదే విషయం కొనుగోలుదారుకు చెప్పినప్పటికీ, ఆయన 2022 మే వరకు ఫ్లాట్ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. అయినప్పటికీ, కొనుగోలుదారుతో చక్కని సంబంధాలు కలిగి ఉండేందుకు పాత జీఎస్టీనే తీసుకున్నామని.. అలాగే అపార్ట్ మెంట్ నిర్వహణకు సంబంధించి ఏడాది చార్జీలను మినహాయించినట్టు వివరించారు. డెవలపర్ వాదనలతో రెరా ఏకీభవించింది. ఫ్లాట్ స్వాధీనం తర్వాత ఫిర్యాదు చేసినందున సెక్షన్ 18 కింద పరిహారం పొందలేరని స్పష్టంచేసింది.

This website uses cookies.