Categories: LATEST UPDATES

అద్దెల కంటే మూలధన విలువలే ఎక్కువ

  • హైదరాబాద్‌లో పెరిగిన క్యాపిటల్‌ వాల్యూస్‌
  • బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో కూడా పెరుగుదల
  • పుణె, కోల్‌కతా, చెన్నైల్లో మాత్ర రివర్స్‌
  • అనరాక్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో అద్దెల కంటే మూలధన విలువలే ఎక్కువగా పెరిగాయి. 2021 చివరి నుంచి 2024 చివర వరకు ఉన్న కాలంలో అద్దె విలువ కంటే క్యాపిటల్‌ వాల్యూస్‌ పెరిగినట్టు అనరాక్‌ తాజా నివేదిక వెల్లడించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి ఉండగా.. పుణె, కోల్‌కతా, చెన్నైల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ నగరాల్లో మూలధన విలువల కంటే అద్దె విలువలు బాగా పెరిగాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మరియు గచ్చిబౌలిలలో అద్దె విలువల కంటే మూలధన విలువలు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. నోయిడాలోని సెక్టార్ 150లో గత మూడేళ్లలో గృహాల ధరలు 128% పెరగ్గా.. అద్దె విలువలు 66% పెరిగాయి.

ఇక్కడ సగటు మూలధన విలువలు చదరపు అడుగుకు రూ.5,700 నుంచి రూ.13,000కి రెట్టింపు అయ్యాయి. అద్దెలు నెలకు రూ.16,000 నుంచి రూ.26,600కి పెరిగాయి. గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్‌లో మూలధన విలువలు 59% పెరగ్గా.. అద్దె విలువలు 47% పెరిగాయి. ఇక్కడ 2021 క్యాలెండర్ సంవత్సరం చివరలో చదరపు అడుగుకు రూ.6,600గా ఉన్న సగటు మూలధన విలువలు 2024 చివరికి వచ్చేసరికి చదరపు అడుగుకు రూ.10,500కి పెరిగాయి. అద్దె విలువలు నెలకు రూ.25,000 నుంచి రూ.36,700కి చేరాయి. బెంగళూరులోని తనిసంద్ర మెయిన్ రోడ్‌లో అద్దె విలువల కంటే (62%) మూలధన విలువలు (67%) ఎక్కువగా పెరిగాయి. సర్జాపూర్ రోడ్‌లో సగటు నెలవారీ అద్దె విలువలు మూలధన విలువల కంటే (63%) ఎక్కువగా పెరిగాయి.

ముంబై చెంబూర్, ములుండ్ లు అద్దె విలువలు వరుసగా 48 శాతం, 43 శాతం పెరగ్గా.. మూలధన విలువలు అంతకంటే పెరిగినట్టు నివేదిక తెలిపింది. పుణె, కోల్ కతా, చెన్నైల్లో అద్దె విలువలు ఎక్కువగా పెరిగినట్టు వివరించింది. పుణేలోని హింజెవాడిలో అద్దె విలువలు 57 శాతం పెరగ్గా.. మూలధన విలువలు కేవలం 37 శాతమే అధికమయ్యాయి. వాఘోలిలో అద్దె విలువ పెరుగుదల 65% కాగా, మూలధన విలువలు 37% పెరిగాయి. కోల్‌కతాలోని ఈఎం బైపాస్‌లో అద్దె విలువ పెరుగుదల 51 శాతం కాగా, ఈ కాలంలో మూలధన విలువలు కేవలం 19% మాత్రమే పెరిగాయి. రాజర్‌హట్‌లో అద్దె విలువలు 37% పెరగ్గా.. మూలధన పెరుగుదల 32% ఎక్కువయ్యాయి.

దేశంలోని ఏడు ప్రధాన నగరాలను పరిశీలించా.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లలో అద్దె విలువల కంటే మూలధన విలువలే ఎక్కువగా పెరిగాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. పూణే, కోల్‌కతా, చెన్నైల్లో మాత్రం రివర్స్ ట్రెండ్ కనిపించిందని వివరించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ వ్యూహాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అద్దెలపై దృష్టి సారించిన పెట్టుబడిదారులు అద్దెలు క్రమంగా పెరుగుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

This website uses cookies.