- 36 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం
హైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. సింగపూర్ కి చెందిన క్యాపిటాలాండ్ గ్రూప్ హైదరాబాద్ లో 36 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 12 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. మాదాపూర్ లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో 2.5 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్ ను అభివృద్ధి చేయడానికి క్యాపిటాలాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్ మెంట్, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతోపాటు ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెడతామని క్యాపిటాలాండ్ వెల్లడించింది. లాజిస్టిక్స్, సౌర విద్యుత్ వంటి మౌలిక వసతుల రంగంలోనూ తమ కార్యకలాపాలు విస్తరిస్తామని పేర్కొంది. తమ తాజా హైదరాబాద్ ప్రాజెక్టు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుందని క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్ మెంట్ లోని ఇండియా డేటా సెంటర్ల ఎండీ సూరజిత్ చటర్జీ తెలిపారు.
హైదరాబాద్ లో క్యాపిటాలాండ్ మూడు బిజినెస్ పార్కులు కలిగి ఉందని ట్రస్ట్ మేనేజర్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తా వెల్లడించారు. ఐటీపీహెచ్, సైబర్ పెరల్, అవెన్స్ పేరిట ఉన్న ఈ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పించడంతోపాటు 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 25 డేటా సెంటర్లను తమ సంస్థ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు.