పదేళ్లయినా ఫ్లాట్ అప్పగించకుండా జాప్యం చేసిన ఓ సంస్థపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. రాజస్థాన్ భివండి జిల్లా అల్వార్ బైపాస్ రోడ్డులో టెర్రా గ్రూప్ అనే సంస్థ టెర్రా కాజిల్ పేరుతో 2011లో ఓ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఆ సమయంలో అను బాల (46) అనే మహిళ తన దివ్యాంగురాలైన కుమార్తె పేరు మీద ఓ ఫ్లాట్ బుక్ చేశారు. ఇందుకోసం రూ.14.17 లక్షలు చెల్లించారు. తన కుమార్తె పెళ్లి సమయంలో దానిని విక్రయించాలనే ఉద్దేశంతో ఆమె ఆ ఫ్లాట్ కొనుగోలు చేశారు. అప్పటికి తన కుమార్తె వయసు పదేళ్లు అని పేర్కొన్నారు. అయితే, పదేళ్లయినా అటు ఫ్లాట్ అప్పగించలేదని, పదేపదే వారి ఆఫీసుకు వెళ్లి అభ్యర్థించినా ఫలితం లేదని అను బాల వాపోయారు. ఎన్నిసార్లు అడిగినా ఫ్లాట్ అప్పగించలేదని, అదే సమయంలో నేను చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను గుర్గావ్ కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ‘నా కుమార్తె పెళ్లికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ ఫ్లాట్ కొన్నా. కానీ గత రెండేళ్లుగా నేను అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఎన్నిసార్లు వారి ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు గతవారం పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు టెర్రా గ్రూప్ పై మోసం, చీటింగ్, నేరపూరిత కుట్ర అభియోగాలను మోపి కేసు నమోదు చేశారు.
This website uses cookies.