Categories: LEGAL

మానసిక వేదన పరిహారం మేమే తేలుస్తాం

  • రెరా స్పష్టీకరణ

ఫ్లాట్ల అప్పగింతలో జరిగిన జాప్యం వల్ల కలిగిన మానసిక వేదనకు పరిహారం ఇచ్చే విషయంలో నిర్ణయాధికారం తమదేనని మహారాష్ట్ర రెరా స్పష్టంచేసింది. తమకు నిర్ణీత సమయంలోగా ఫ్లాట్ అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేసిన ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ కు వ్యతిరేకంగా సంజయ్, శైలజా గైక్వాడ్ లు చేసిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత మహా రెరా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే ఫ్లాట్ అప్పగించేలా ఆ సంస్థను ఆదేశించాలని కోరడంతోపాటు, తామను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.2 కోట్ల పరిహారం ఇప్పించాలని ఫిర్యాదుదారులు అభ్యర్థించారు.

ముంబైలోని ఓంకార్ 1973 వర్లీ ‘సి’ టవర్ 46వ అంతస్తులో వీరు ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.21 కోట్లు చెల్లించారు. 2019 జూన్ 30లోగా ఫ్లాట్ అప్పగించాల్సి ఉంది. కానీ ఓంకార్ గ్రూప్ అందులో విఫలమైంది. చివరకు 2021 జూన్ 30న ఫ్లాట్ అప్పగిస్తామని పేర్కొంది. దీంతో వారు రెరాను ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం అప్పగింత తేదీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరు నెలలు మించి పొడిగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన కాలానికి సంబంధించి తమకు వడ్డీ చెల్లించడంతోపాటు తాము పడిన మానసిక వేదనకు పరిహారం ఇప్పించాలని కోరారు. అయితే, ఓంకార్ సంస్థ దీంతో విభేదించింది. కోవిడ్, ఇతర కారణాల వల్ల ఫ్లాట్ అప్పగింతలో జాప్యం జరిగిందని, ఈ విషయాన్ని రెరా వెబ్ సైట్ లో కూడా పొందుపరిచామని నివేదించింది. ఈ నేపథ్యంలో పరిహారం చెల్లించాలని గైక్వాడ్ లు కోరడం సహేతుకం కానందున, ఈ పిటిషన్ తోసిపుచ్చాలని కోరింది. రియల్ ఎస్టేట్ చట్టం, 2016 ప్రకారం పరిహారం విషయాలను మహా రెరా అడ్జుకేటింగ్ అధికారి మాత్రమే పరిశీలించాలని పేర్కొంది. అయితే, గైక్వాడ్ తరఫు న్యాయవాది దీంతో విభేదించారు. పంకజ్ అగర్వాల్ కేసులో మహా రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రెరా దృష్టికి తెచ్చారు. పరిహారం విషయాన్ని రెరా కూడా తేల్చవచ్చని స్పష్టంచేశారు. ఈ వాదనతో మహారెరా సభ్యుడు విజయ్ సత్బీర్ సింగ్ ఏకీభవించారు. పరిహారం విషయాన్ని తేల్చే నిర్ణయాధికారం తమకు ఉంటుందని స్పష్టం చేస్తూ.. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

This website uses cookies.