Categories: LATEST UPDATES

అందుబాటులోకి భారీగా ఆఫీస్ స్పేస్..

  • 2023-2025 మధ్యలో 165 మిలియన్ చ.అ. సరఫరా
  • సీబీఆర్ఈ తాజా నివేదిక వెల్లడి

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భారీగా ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రాబోతోంది. 2023-2025 మధ్య కాలంలో కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ రానున్నట్టు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2020-2022 మధ్య కాలంలో 142 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ సరఫరా కాగా.. 2023-2025లో ఇది ఇంకా ఎక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా రాబోయే ఆఫీస్ స్పేస్ లో సింహ భాగం బెంగళూరు, హైదరాబాద్ లోనే ఉండనుంది. మొత్తం సరఫరాలో సగం ఈ రెండు నగరాల్లోనే రాబోతోంది.

కొత్తగా రాబోయే ఆఫీస్ స్పేస్ లో బెంగళూరులో 47.8 మిలియన్ చదరపు అడుగులు (మొత్తం సరఫరాలో 29 శాతం) ఉండగా.. హైదరాబాద్ లో 33 మిలియన్ చదరపు అడుగులు (20 శాతం) రానుంది. ఢిల్లీ 28 మిలియన్ చదరపు అడుగులు (17 శాతం), పుణె 19.8 మిలియన్ చదరపు అడుగులు (12 శాతం), చెన్నై 18.15 మిలియన్ చదరపు అడుగులు (11 శాతం), ముంబై 14.8 మిలియన్ చదరపు అడుగులు (9 శాతం), కోల్ కతా 3.3 మిలియన్ చదరపు అడుగులు (2 శాతం) ఉండనున్నాయి.

2023-2025 మధ్య మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరాలో 29 శాతం వాటాతో బెంగలూరు టాప్ లో ఉంది. తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ‘భారతదేశ కార్యాలయ రంగం మంచి వృద్ధిని సాధిస్తోంది. 2023-2025 నాటికి దేశంలోని అగ్ర నగరాల్లో 165 మిలియన్ చదరపు అడుగుల సరఫరా పూర్తవుతుందని అంచనా. ఇది ఆఫీస్ స్పేస్ విభాగంలో సానుకూల పరిణామం. 2020 నుంచి 2022 వరకు మూడేళ్ల కాలంలో సగటు వార్షిక కార్యాలయ సరఫరా 17 శాతం పెరిగింది. ఈ వృద్ధి తదుపరి మూడేళ్ల కాలంలో 15 నుంచి 18 శాతం వరకు ఉంటుందని అంచనా’ అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు.

This website uses cookies.