ఇటీవల ప్రపంచం చాలా మారింది. మనం ప్రపంచాన్ని చూసే దృక్పథంలో మార్పు వచ్చింది. మన పనిని, కుటుంబాన్ని, స్నేహితులను.. ఇంకా ఇళ్లను ఎలా చూస్తామో కూడా మారింది. వీటన్నింటి కంటే కరోనా నేపథ్యంలో మనకు చాలా ఖాళీ సమయం కూడా దొరికింది. దీంతో ఇంటిని పునర్నిర్మించడం, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి అంశాలు నటుడు చందన్ రాయ్ సన్యాల్ కు బాగా నచ్చేశాయ్. తన కలల సౌథాన్ని నిర్మించుకోవడానికి ఈ రంగ్ దే బసంతి ఫేమ్ దగ్గర మంచి చిట్కాలు ఉన్నాయండోయ్. ఆ విషయాలను రియల్ ఎస్టేట్ గురుతో ఆయన పంచుకున్నారు.
‘2018లో నేను సొంత ఇంటిని కొనుగోలు చేశాను. నా చిన్నతనంలో ఢిల్లీ కరోల్ బాగ్ లో ఉండేవాళ్లం. మాది మధ్యతరగతి కుటుంబం. నా తల్లిదండ్రులు నన్ను బర్సాతిలో పెంచారు. అక్కడి వంటగది గుడారంలా ఉండేది. లోపలంతా నీరు నిలిచిపోయా అస్తవ్యస్తంగా ఉండేది. తర్వాత నేను ముంబైకి మారినప్పుడు తోటి నటులతో కలిసి ఉండేవాడిని. నాకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాతే ముంబై వంటి అత్యంత ఖరీదైన నగరంలో సొంత ఇల్లు కొనుక్కోగలిగాను’ అని వివరించారు.
మంచి ఇంటికి అద్దె చెల్లించడం ఆయనకు ఓ సవాల్ మాత్రమే కాదు. అంతకుముందు అది ఒక అవసరంగా కూడా మారింది. అలాంటి సమయంలో ఒకానొక దశలో సొంత ఇల్లు కావాలనే అంశం చందన్ పై తీవ్ర ఒత్తిడి సృష్టించింది. కమీని వంటి ప్రముఖ చిత్రాలతోపాటు మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి హాలీవుడ్ సినిమాలు చందన్ జీవితాన్ని మలుపు తిప్పాయి. దీంతో సొంత ఇల్లు కల నేరవేరింది. ‘నేను సాధారణ జీవితాన్నే ఇష్టపడతాను. మెట్రోపాలిటన్ నగరంలో ఇంటి ఒత్తిడిని తట్టుకోలేను. చక్కని గాలి వెలుతురు వచ్చే అపార్ట్ మెంట్ బాగుంటుంది. కేవలం అవసరమైన వస్తువులు మాత్రమే కలిగి ఉంటే మీ జీవనశైలి పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చందన్ పేర్కొన్నారు.
మిగిలినవన్నీ నిజానికి మనకు అవసరం లేని విలాసవంతమైన వస్తువులని ఆయన భావిస్తున్నారు. ‘నా వద్ద అపరిమితమైన డబ్బు ఉంటే, నా దృష్టి మొదటగా నా ఇంటికి జీవం పోసే మొక్కలపై మళ్లుతుంది. అది చక్కని వాతావరణాన్ని జోడిస్తుంది. ఇది నాకు కేవలం ఓ డెకర్ వస్తువు కాదు.. అంతకు మించినది. ఇక మీ ఇంటిని ఆకర్షణీయంగా అలంకరించడానికి పెయింటింగులు ఓ మార్గం. అవి ఇంటిని చక్కని అందాన్ని, గోడలకు చక్కని కళను తెస్తాయి. అయితే, ఏది ఎంచుకోవాలనేది చాలా క్లిష్టమైన అంశం. ఇక నా ఇంట్లో సంగీతాన్ని వినడాన్ని బాగా ఇష్టపడతాను. అలాగే కొన్నిసార్లు ఇంట్లో తాగడం కూడా ఇష్టమే. సినిమాల్లో చూసినట్టుగా నా బంగ్లాలో కూడా ఔట్ హౌస్ ఉండాలి’ అని చెప్పారు.
చందన్ ప్రస్తుతం రచనలు కూడా చేస్తున్నారు. అవి రాయడం కోసం తన ఇంట్లో మంచి ప్రదేశం కూడా ఎంపిక చేసుకున్నారు. ‘నాకు వంట చేయడం చాలా ఇష్టం. అదేమీ అబ్బురపరిచే విషయం కాదు. ఇది సరదాగా, సృజనాత్మకంగా ఉంటుంది. కొన్నిసార్లు శృంగారభరితంగా కూడా మారుతుంది. టేబుల్ వద్ద లేదా కినెచ్ బార్ లో వెనుక నుంచి వెళ్లి వాటేసుకోవడం బాగుంటుంది. పైగా ఇదంతా సముద్రతీరంలో చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. నేను అలాగే ఊహించుకుంటున్నా. నాకు సేద తీరేలా చక్కని గాలి కావాలి. నీటిని చూస్తూ, అక్కడ జీవిత భాగస్వామితో కలిసి ఉండటాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి? అలాంటి ప్రదేశం విషయానికి వస్తే నేను ఎంచుకున్న ప్లేస్ ఫ్రెంచ్ జలాలు’ అని చెప్పి ముగించారు.
This website uses cookies.