ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేసినందుకు ఆయా ఫ్లాట్ల కొనుగోలుదారులకు పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ) ఓ డెవలపర్ ను ఆదేశించింది. ఫ్లాట్లు అప్పగించేంత వరకు ఆలస్యమైన ప్రతి నెలకూ ఆ ఫ్లాట్ ఖరీదులో 6 శాతం చెల్లించాలని సూచించింది. నెలరోజుల్లోగా పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఇంకా ఫ్లాట్లు అప్పగించని కొనుగోలుదారులకు కన్వేయన్స్ డీడ్ చేసి ఇవ్వాలని పేర్కొంది. ఏ టవర్ కైనా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ తీసుకుంటే వెంటనే అది కూడా తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే ఫ్లాట్ కొనుగోలుదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదైనా ఉంటే.. ఆరు వారాల్లోగా చెల్లించాలని సూచించింది. గురుగ్రామ్ లోని 450 ఎకరాల్లో ఉన్న రామప్రస్థ సిటీ 2008లో ప్రారంభమైంది. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగిస్తామని డెవలపర్ హామీ ఇచ్చారు. అయితే, నిర్దేశిత గడువు ముగిసినా ఫ్లాట్లు అప్పగించకపోవడంతో కొంతమంది కొనుగోలుదారులు 2015లో కమిషన్ ను ఆశ్రయించారు. అనంతరం 2018లో ఫ్లాట్ల అప్పగింత మొదలైంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 1500 కుటుంబాలు నివసిస్తున్నాయి.
This website uses cookies.