Categories: TOP STORIES

రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులొచ్చాయ్!

  • రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, డాక్కుమెంట్స్
    డెలివరీ అన్నీ ఒక్కరోజులేనే పూర్తి
  • ఆధార్ అనుసంధానంతో మోసాలకు చెక్
  • ఆన్ లైన్ లోనే పలు సేవలు
  • రియల్ ఎస్టేట్ గురుతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
    జాయింట్ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ వేముల‌ శ్రీనివాస్
Vemula Srinivas, Joint Inspector General, Stamps & Registrations Department, Telangana State.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్‌పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ వేముల‌ శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియ మొత్తం ఒక్కరోజులేనే పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఫీజు ఎంత చెల్లించాలి? మార్కెట్ విలువలు ఎలా నిర్ధారిస్తారు వంటి పలు అంశాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ముఖ్యంగా పేమెంట్స్ లో, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో అనేక మార్పులు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలయినా.. ఏ రకంగా పేమెంట్ చేశారు? ఏ బ్యాంకులో పేమెంట్ చేశారు? వంటి వివరాలు ప్రజలు తెలుసుకునేలా డాక్యుమెంట్ లో ఎండార్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల మోసాలకు చెక్ పడటంతోపాటు మరింత పారదర్శకత వస్తుంది. అలాగే పాన్ కార్డుతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇన్ కమ్ ట్యాక్స్ కు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేశాం. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, జీహెచ్ఎంసీతో సమాచారం తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.

ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ఏ ప్రాపర్టీ విషయంలోనైనా.. సదరు ఆస్తిని యజమానే అమ్ముతున్నాడా, లేదా గిఫ్ట్ ఇస్తున్నాడా అనేది మా సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్లీ పంచాయతీలు లేదా మున్సిపాలిటీలకు వెళ్లకుండా వెంటనే మ్యుటేషన్ కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చేస్తారు. ఇదంతా కూడా ఒక్క రోజులోనే జరుగుతుంది. అంటే.. రిజిస్ట్రేషన్ చేసి, మ్యుటేషన్ పూర్తి చేసి, డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అదేరోజు వాటిని పార్టీలకు వెనక్కి ఇచ్చేస్తారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా ప్రజలకు కలిగిన వెసులుబాట్లు.

వెబ్ సైట్ లో సమస్త సమాచారం..

తెలంగాణ రాష్ట్రంలో మీరు ఫ్లాట్ లేదా ప్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మా అధికారిక వెబ్ సైట్ (registration.telangana.gov.in) లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ ఏమైనా నిషేధిత జాబితాలో ఉందా అనేది చూడాలి. అంటే ఆ పాపర్టీ గవర్న్ మెంట్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, వక్ఫ్ భూమా, అసైన్డ్ భూమా లేదా ఆ ప్రాపర్టీ చట్టప్రకారం అమ్మడానికి, కొనడానికి వీలులేనిదా అనేది ప్రొహిబిటెడ్ జాబితాలో చూడొచ్చు. అంతేకాకుండా మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ మార్కెట్ విలువ ఎంత అనేది కూడా వెబ్ సైట్ లో చూడొచ్చు. అలాగే డాక్యుమెంట్ మీరే సొంతంగా రాసుకోవాలనుకుంటే, అది కూడా వెబ్ సైట్ లో ఉంది. తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎక్కువ సేపు ఉండకుండా చూసుకునేందుకు మీరు రాసుకున్న డాక్యుమెంట్ ను సిటిజన్ డేటా ఎంట్రీ ద్వారా ముందగానే సబ్ మిట్ చేయొచ్చు. దాన్నే స్లాట్ బుకింగ్ అని కూడా అంటారు. మీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎప్పుడు రావాలి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత చెల్లించాలని వంటి అంశాలన్నీ కూడా ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి సమాచారం వెబ్ సైట్ లో ఉంది.

ఆన్ లైన్ లో ఈసీ సమాచారం..

ఇక మీకు ఈసీ కావాలనుకుంటే, మీరు వివరాలు ఇస్తే.. ఆన్ లైన్ లోనే మేం దానికి సంబంధించిన వివరాలు ఉచితం ఇస్తాం. అలా కాకుండా ఈసీ సర్టిఫికెట్ రూపంలో కావాలనుకుంటే మాత్రం మీ సేవ కేంద్రానికి వెళ్లాలి. మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే మీకు దగ్గర్లోని మీ సేవ కేంద్రం నుంచి పొందొచ్చు. మీరు ఆదిలాబాద్ లో ఉన్నా.. హైదరాబాద్ లోని ప్రాపర్టీకి సంబంధించి ఈసీ తీసుకునే వెసులుబాటు ఉంది. అంటే ప్రాపర్టీ ఉన్న ప్రదేశానికి వెళ్లక్కర్లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి ఈసీ అయినా తీసుకొవచ్చు. లేదంటే ప్రాపర్టీ ఏ పరిధిలో ఉందో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి కూడా ఈసీ తీసుకొవచ్చు. ఈసీతోపాటు సర్టిఫైడ్ కాపీలను మీ సేవా కేంద్రాల నుంచి తీసుకొచ్చు. ఈసీ సమాచారాన్ని 1983 నుంచి అప్ డేట్ చేశాం. అంటే 1983 నుంచి 2023 వరకు ఈసీ కావాలనుకుంటే ఒక్క బటన్ క్లిక్ తో తీసుకోవచ్చు. 1983 కంటే ముందు ఈసీ కావాలంటే మాత్రం మాన్యువల్ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఇందుకోసం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

మార్కెట్ విలువల నిర్ధారణకు కమిటీలు..

మార్కెట్ విలువలను నిర్ధారించడానికి కమిటీలుంటాయి. అర్బన్ కమిటీ, రూరల్ కమిటీ అని ఉంటాయి. రూరల్ కమిటీలంటే.. గ్రామపంచాయతీకి సంబంధించిన భూములు.. వ్యవసాయ లేదా వ్యవసాయేతర భూములు కావొచ్చు. దీనికి సంబంధించి ఆర్డీవో ఆధ్వర్యంలో ఎండీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ సభ్యులుగా ఈ కమిటీలు ఉంటాయి. అర్బన్ ప్రాపర్టీలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలుంటాయి. ఇందులో మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా సబ్ రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారు.

వీరంతా కలిసి స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ విలువలు నిర్ధారిస్తారు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఏడేళ్లు మార్కెట్ విలువలను పెంచలేదు. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందనేది గమనించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్కెట్ విలువను స్థిరీకరించింది. తర్వాత మార్కెట్ విలువను శాస్త్రీయ పద్ధతిలో సవరించారు. మార్కెట్ విలువ నిర్ధారణలో ఏ అధికారికీ కూడా పక్షపాతం లేదా ఇష్టమొచ్చినట్టు మార్చే అధికారం లేదు. మార్కెట్ విలువల గైడ్ లైన్స్ రిజిస్టర్ లో చెప్పిన రేటు మీకు ఆమోదయోగ్యం కానప్పుడు ఆ అంశం కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి వెళ్తుంది. ఆ కమిటీ అన్ని పరిశీలించి, మార్కెట్ విలువను తగ్గించాలా లేక అలాగే ఉంచాలా అనేది నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రంలో ఎక్కడైనా స్టాంపు డ్యూటీ ఒకటే రేటు..

స్టాంపు డ్యూటీ అనేది రాష్ట్రమంతా ఒకటే ఉంటుంది. అగ్రికల్చర్ అయినా నాన్ అగ్రికల్చర్ అయినా సరే ఒకటే. సేల్ డీడ్ తీసుకుంటే అన్నీ కలిపి ఏడున్నర శాతంగా ఉంది. అంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ ఫర్ ఫీజు అన్నీ కలిపి ఏడున్నర శాతం అన్నమాట. అలాగే మార్టిగేజ్, గిఫ్ట్, ఇతరత్రా అంశాలకు తక్కువ ఉంటుంది. సేల్ డీడ్ కే ఎక్కువ ఉంటుంది. ఆదిలాబాద్ అయినా, హైదరాబాద్ లో అయినా ఒకటే రేటు. అయితే, మార్కెట్ విలువల్లో తేడాలుంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో మార్కెట్ విలువలు ఎక్కువగా ఉంటాయి. అదే ఆదిలాబాద్, కరీంనగర్ వంటి చోట్ల తక్కువ ఉంటాయి. ఇది ఓపెన్ ఎకానమీ. ఏ వస్తువు లేదా సేవకైనా డిమాండ్, సప్లై అనే సూత్రం మీదనే దాని విలువ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు ఉండాలనుకునే చోట సాధారణంగా మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంటుంది.

అపార్ట్ మెంట్ లో కాంపోజిట్ వాల్యుయేషన్..

అపార్ట్ మెంట్ విషయంలో మన రాష్ట్రంలో కాంపోజిట్ వాల్యుయేషన్ ఉంది. అంటే ల్యాండ్, స్టక్చర్ కలిపి చదరపు అడుగుకే విలువ నిర్ధారిస్తాం. ఉదాహరణకు వెయ్యి చదరపు అడుగులు అపార్ట్ మెంట్ కొనుక్కుంటే.. అక్కడ మార్కెట్ విలువ చదరపు అడుగుకు రూ.3వేలు ఉంటే.. వెయ్యి చదరపు అడుగులకు మార్కెట్ విలువ రూ.30 లక్షలు అవుతుంది. అప్పుడు ఆ రూ.30 లక్షలపై ఏడున్నర శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఫ్లాట్ ను రూ.50 లక్షలకు కొనుక్కుంటే.. ఆ రూ.50 లక్షలపై ఏడున్నర శాతం చెల్లించాలి. అంటే.. మీరు నిజంగా ఎంత చెల్లించారు లేదా మార్కెట్ విలువలో ఏది ఎక్కువైతే దానిపై ఏడున్నర శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. మార్కెట్ విలువ ఎక్కడ ఎంత ఉందనే విషయం మా వెబ్ సైట్ లో ఉంటుంది. అపార్ట్ మెంట్, ల్యాండ్.. దేనికి సంబంధించిన మార్కెట్ విలువనైనా జిల్లాలవారీగా పొందే అవకాశం ఉంది.

కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు?

మీరు ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ కొంటున్నారో సదరు వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అతని వ్యక్తిత్వం ఏమిటి? క్రెడెన్షియల్స్ ఎలా ఉన్నాయి వంటి అంశాలు చూడాలి. అలాగే ప్రాపర్టీని భౌతికంగా పరిశీలించాలి. స్థానికంగా ఎంక్వైరీ చేయాలి. సదరు ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ల్యాండ్ లార్డ్, డెవలపర్ మధ్య విభేదాలున్నాయా చూసుకోవాలి. అలాగే ఈసీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే.. అవి ఎలా పోయాయి? వాటిని తిరిగి పొందడానికి పోలీసు కేసు పెట్టారా అనే వివరాలు కూడా తెలుసుకోవాలి. కలర్ జిరాక్స్ పెట్టి అమ్మడానికి ప్రయత్నించడం.. నలుగురో, ఐదుగురో యజమానులు ఉంటే ఒకరో ఇద్దరో అమ్మడం వంటి విషయాల పట్లా అప్రమత్రంగా ఉండాలి. సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. సర్వే నెంబర్లు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించాలి. అసైన్డ్ ల్యాండ్ అయితే అస్సలు కొనొద్దు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చూసుకున్న తర్వాతే ప్రాపర్టీ కొనాలి. మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి.

This website uses cookies.