Categories: TOP STORIES

చౌటుప్ప‌ల్‌.. ఎప్పుడ‌య్యేను గ‌చ్చిబౌలి?

విజయవాడ హైవే మరో గచ్చిబౌలి అవుతుందంటూ చెన్నైకి చెందిన ఒక బడా లేఅవుట్ సంస్థ హైదరాబాద్లో తెగ హడావిడి చేస్తోంది. నిజంగానే విజయవాడ హైవే మరో గచ్చిబౌలి అవుతుందా? ఎప్పటిలోపు అవుతుంది? ఎలా అవుతుంది? చౌటుప్పల్లో ఆ సంస్థ వేసిన లేఅవుట్లో అధిక రేటుకు ప్లాట్లను అమ్ముకునేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందా? మీరు ఆలోచించండి.. అసలు విజయవాడ హైవే మీద ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని ఏనాడైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా? చౌటుప్పల్ వరకూ నగరం విస్తరించడానికి.. డెవలప్ అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో మీరు ఆ మాత్రం అంచనా వేయలేరా?

హైద‌రాబాద్ సింగ‌పూర్ కావాల‌నో.. లండ‌న్ అవ్వాల‌నో కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. విదేశీ న‌గ‌రాల స‌ర‌స‌న నిలిచేందుకు పోటీ ప‌డుతోంద‌ని గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. కానీ, చౌటుప్పల్ ఏరియా మ‌రో గ‌చ్చిబౌలి అవుతుంద‌ని ఓ సంస్థ చేస్తున్న ప్ర‌చారం చూస్తుంటే.. ప్ర‌జ‌లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. చెన్నైకి చెందిన ఈ కంపెనీ చౌటుప్పల్లో ఒక వెంచర్ ను ఆరంభించింది కాబట్టి.. అందులో ప్లాట్లను అమ్ముకోవడానికే ఇలా ప్రచారం చేయడం చూసి నవ్వుకుంటున్నారు. ప్లాట్లు అమ్ముకోవాలనే స్వార్థంతో ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయినా, ఐటీ కంపెనీలు వచ్చేవి ఉప్పల్, పోచారంలో తప్ప.. విజయవాడ హైవేలో కాదనే విషయం చాలామందికి తెలిసిందే.

తెలంగాణ ప్ర‌భుత్వం అన్నివైపులా ఐటీ, ఐటీఈఎస్ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ లుక్ ఈస్ట్ పాల‌సీని తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో పోచారం చుట్టుప‌క్క‌ల ఐటీ కంపెనీలు వ‌చ్చి త‌మ కార్యాల‌యాల్ని నెల‌కొల్పేందుకు ప్ర‌త్యేకంగా ప్రోత్స‌హిస్తున్నారు. అంతేత‌ప్ప‌, చౌటుప్పల్లో ఐటీ కంపెనీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడూ ప్ర‌క‌టించిన దాఖ‌లాల్లేవు. గ్రిడ్ పాల‌సీ వ‌ల్ల ఉప్ప‌ల్‌, నాచారంలో ఐదు ఐటీ కంపెనీలు ఏర్పాట‌వుతాయ‌నే విష‌యం తెలిసిందే. ఇంకా అనేక సంస్థలు ఇక్కడ కార్యకలాపాల్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వాస్తవానికి గమనిస్తే.. మాదాపూర్‌, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఎంత‌లేద‌న్నా ప‌దిహేను వంద‌ల ఐటీ కంపెనీలున్నాయి. అందుకే, ప‌శ్చిమ హైద‌రాబాద్ గ‌త రెండు ద‌శాబ్దాల్లో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. మ‌రి, ఈ స్థాయిలో విజయవాడ హైవేలో ఐటీ కంపెనీలు వచ్చేదెన్నడు.. ఆ ప్రాంతం డెవలప్ అయ్యేదెప్పుడు? అని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు.

* హైద‌రాబాద్ నుంచి చౌటుప్ప‌ల్ సుమారు 45 కిలోమీట‌ర్ల దాకా ఉంటుంది. రామోజీఫిలిం సిటీ మెయిన్ రోడ్డు నుంచి దాదాపు 21 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ హైవేలోని పలు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కులు, చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా ఉత్ప‌త్తి సంస్థ‌లను అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం దృష్టి సారించిందే త‌ప్ప‌.. ఐటీ కంపెనీల‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఎప్పుడూ ప్ర‌క‌టించిన దాఖ‌లాల్లేవు. కాబ‌ట్టి, ఔత్సాహిక కొనుగోలుదారులు ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ‌హించాలి. జేబులో కాస్త ఎక్కువ సొమ్మున్న వారు ఇలాంటి వాటిలో పెట్టుబ‌డి పెడితే పెట్టొచ్చు. కానీ, కృత్రిమంగా పెంచుతున్న ప్లాట్ల ధ‌ర‌ల్ని చూసి.. భ‌విష్య‌త్తులోనూ అదే విధంగా రేట్లు పెరుగుతాయ‌నే భ్ర‌మ‌లో ప‌డి.. మీ క‌ష్టార్జితాన్ని అలాంటి వాటిలో మ‌దుపు చేయ‌కపోవడమే అన్ని విధాల ఉత్తమం. వాస్త‌వ ప‌రిస్థితుల్ని అంచ‌నా వేసి.. కేవ‌లం అభివృద్ధికి ఆస్కార‌మున్న ప్రాంతాల్లో మాత్ర‌మే ప్లాట్ల‌ను కొనుగోలు చేస్తే.. మీ కష్టార్జితానికి ఎలాంటి ఢోకా ఉండదు. 2006 నుంచి 2008 దాకా బూమ్ టైమ్లో.. బెంగళూరుకు చెందిన ఒక రియల్ సంస్థ.. హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు ముప్పయ్ ప్రాజెక్టులను ఇలాగే ప్రారంభించి తెగ హడావిడి చేసింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల పత్తా లేకుండా పోయింది. కాబట్టి, అలాంటి కంపెనీలు వస్తూనే ఉంటాయి.. హడావిడి చేస్తూనే ఉంటాయి. మీరు మాత్రం ఆ మాయాజాలంలో పడకపోవడమే అన్నివిధాల ఉత్తమం.

చౌటుప్ప‌ల్‌లో చ‌ద‌ర‌పు గ‌జం ప‌ద్దెనిమిది వేలా?

చౌటుప్ప‌ల్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ప్లాట్ల ధ‌ర‌లు మ‌హా అయితే రూ.6 నుంచి రూ.8 వేలు ఉంటుంది. ఇంకా కొన్ని లేఅవుట్ల‌లో అంత‌కంటే త‌క్కువ‌కే ల‌భిస్తాయి. చౌటుప్ప‌ల్‌కి వెళ్లి చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.18 వేలు పెట్ట‌డం బ‌దులు రామోజీ ఫిలిం సిటీ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఆ రేటుకు నివాస‌యోగ్య‌మైన ప్లాట్లు ల‌భిస్తాయ‌నే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు. కాబ‌ట్టి, వాస్త‌వికంగా ఆలోచించి.. ప్లాట్ల ఎంపిక‌లో తెలివైన నిర్ణ‌యం తీసుకోండి. అయినా, చౌటుప్పల్ వరకూ నగరం డెవలప్ అయ్యేందుకు ఎంతలేదన్నా మరో పది, పదిహేనేళ్లు అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి, ప్లాట్ల ఎంపికలో వాస్తవాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయానికి రావాలే తప్ప.. రాత్రికి రాత్రే బ్రహ్మాండం బద్ధలయ్యే విధంగా చౌటుప్పల్ అభివృద్ధి చెందదనే విషయాన్ని గుర్తుంచుకోండి.

This website uses cookies.