- కొనుగోలుదారుల పాట్లు
బిల్డర్ల కారణంగా నష్టపోయిన పలువురు కొనుగోలుదారులు తమకు రావాల్సిన పరిహారం కోసం రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏళ్లుగా వారి చుట్టూ తిరుగుతున్న ఫలితం మాత్రం కనిపించట్లేదు. బిల్డర్ల నుంచి ల్యాండ్ రెవెన్యూ బకాయిలుగా సదరు మొత్తం వసూలు చేసి, దానిని నష్టపోయిన బాధితులకు ఇవ్వాలని రెరా ఆదేశించింది. అయితే, రెవెన్యూశాఖ అలసత్వం కారణంగా ఇది సక్రమంగా జరగడంలేదు.
ఉదాహరణకు 631 కేసుల్లో 125 మంది బిల్డర్ల నుంచి రూ.258 కోట్లు వసూలు చేసి కొనుగోలుదారులకు చెల్లించాలని రెరా సూచించింది. అయితే, ఇప్పటివరకు కేవలం 17 కేసుల్లో రూ.8 కోట్లు మాత్రమే రెవెన్యూ అధికారులు వసూలు చేశారు. ఇంకా 614 కేసుల్లో రూ.250 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బిల్డర్ల కార్యాలయాల చుట్టూ తిరిగిన ఆయా కొనుగోలుదారులు.. ఇప్పుడు తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ పరిహారం ఎంతవరకు వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో సీఎం బసవరాజ్ బొమ్మై జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.