వైజాగ్ టెక్ పార్కుకు కూడా..
ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (రూ.4,592 కోట్లు), వైజాగ్ టెక్ పార్క్ (రూ.21,844 కోట్లు), తారకరామ తీర్థ సాగం ప్రాజెక్టు (రూ.194.40 కోట్లు), చింతలపల్లి ఫిష్ ల్యాండ్ సెంటర్ (రూ.23.73 కోట్లు) వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
ఆర్థికాభివృద్ధితోపాటు ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేసేందుకు 2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయానికి ఈ సందర్భంగా జగన్ శంకుస్థాపన చేశారు. జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్స్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. దీని నిర్మాణం ద్వారా దాదాపు 6 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు భోగాపురం విమానాశ్రయం కీలకపాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ సాధనంగా ఈ విమానాశ్రయం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా భోగాపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. కార్గో, సరుకు రవాణాకు భోగాపురం ఎయిర్ పోర్టు కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రానికి సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుందని, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళుతందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైజాగ్ టెక్ పార్కుతోపాటు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఆభరణాలుగా నిలుస్తాయన్నారు. కొత్త విమానాశ్రయంలో 2026నాటికి రెండు రన్ వేలు ఉంటాయని, మొదటి దశలో 60 లక్షల మందికి సౌకర్యాలు కల్పిస్తామని.. తర్వాత 4 కోట్ల మందికి అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు.