Categories: LATEST UPDATES

ఈవీలపై ఇన్వెస్టర్ల మోజు

  • విద్యుత్ వాహనాల పరిశ్రమల్లోకి ఆరేళ్లలో రూ.3.4 లక్షల కోట్ల పెట్టుబడులు
  • తద్వారా రియల్ రంగానికీ ఊతం
  • కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి

దేశంలో విద్యుత్ వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు కూడా ఆ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈవీ, అనుబంధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఈ విభాగంలోకి దేశ, విదేశీ సంస్థలు రూ.3.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. భారత్‌లో ఈవీల వినియోగం 8 శాతంగా ఉందని.. 2024లో ఈవీల అమ్మకాలు సుమారు 20 లక్షల యూనిట్లుగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయని తెలిపింది.

అయితే, 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఈవీల వాటాను 30 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం దిశగా పురోగతి మాత్రం అంత లేదని పేర్కొంది. ఈవీల వినియోగం చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ, ఊహించినంత వేగంగా పుంజుకోవడం లేదని అభిప్రాయపడింది. ఈవీ విభాగంలో 2030 వరకు కంపెనీలు దశలవారీగా 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,40,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నాయని వెల్లడించింది. ఇందులో 27 బిలియన్ డాలర్లు లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై, 9 బిలియన్ డాలర్లు ఈవీలు, ఒరిజినల్ విడిభాగాల (ఓఈ) తయారీపై వెచ్చించనున్నట్లు వివరించింది.

ఈవీ రంగంలోకి భారీ పెట్టుబడుల రాకతో రియల్ ఎస్టేట్ పరిశ్రమకు కూడా ఊతం లభించగలదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పరిశ్రమలు.. వేర్‌హౌసింగ్‌ విభాగంలో గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఈవీలు, ఓఈలు, లిథియం అయాన్ బ్యాటరీలు తదితరవాటి తయారీ కోసం స్థల సమీకరణ, ప్లాంట్ల ఏర్పాటు వేగవంతం కావచ్చని అభిప్రాయపడింది. 2030 నాటికి 30 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సాధించాలని భారత్ నిర్దేశించుకుంది.

అంటే సుమారు 8 కోట్ల ఈవీలు ఉండాలి. అయితే, అమ్మకాల పరిమాణం స్థిరంగా పెరుగుతూ, ప్రభుత్వం నుంచి కూడా తోడ్పాటు అందుతున్నప్పటికీ పురోగతి పెద్దగా లేదు. ప్రస్తుతం ఈవీల విస్తృతి దాదాపు 8 శాతంగా, వాహనాల సంఖ్య దాదాపు 50 లక్షలలోపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే వివిధ కేటగిరీలవ్యాప్తంగా ఈవీల వినియోగం అనేక రెట్లు వృద్ధి చెందాలని నివేదిక సూచించింది. సబ్సిడీలు, పన్నులపరమైన ప్రోత్సాహకాలు, దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు చార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరిస్తే వివిధ కేటగిరీలవ్యాప్తంగా ఈవీల అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొంది.

This website uses cookies.