దేశంలో డేటా సెంటర్లు దూసుకెళ్తున్నాయి. ఈ విభాగం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2019-24 మధ్య ఆరేళ్ల కాలంలో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో 2027 చివరికి డేటా సెంటర్లలోకి వచ్చే పెట్టుబడులు 100 బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది.
పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. కాగా, 2025 ఆఖరు నాటికి భారత డేటా సెంటర్ సామర్థ్యం 2,070 మెగావాట్ల స్థాయికి చేరుకోనుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఇది 1,255 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి 1,600 మెగావాట్లకు చేరుకోవచ్చనే అంచనా. డేటా సెంటర్ల సంఖ్యాపరంగా ముంబై అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాల్లో 90 శాతం ఈ నగరాల్లోనే ఉన్నాయి.
టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడం, డిజిటల్ పరివర్తన, ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, సానుకూల విధానాలు, కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా మొదలైనవి డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడతాయని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వ తోడ్పాటు, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల దన్నుతో భారత డేటా సెంటర్ మార్కెట్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోందని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ రంగాల నుంచి డిమాండ్ నెలకొనడం, రాష్ట్రాల స్థాయిలో పాలసీలపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు.
This website uses cookies.