- సుప్రీంకోర్టు స్పష్టీకరణ
హౌసింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి కంప్లీషన్ సర్టిఫికెట్ (సీసీ) తీసుకునే బాధ్యత పూర్తిగా బిల్డర్ దేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ ఆ సర్టిఫికెట్ రాకముందే ఆయా ఫ్లాట్ల ఓనర్లు వాటిని ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ, సీసీ బాధ్యత మాత్రం బిల్డర్ దేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఇచ్చిన తీర్పును ఆక్షేపించింది. ‘వాస్తవానికి ఫ్లాట్ కొనుగోలుదారులు కంప్లీషన్ సర్టిఫికెట్ లేకుండా ఫ్లాట్లను ఆధీనంలోకి తీసుకోకూడదు. కానీ అంత మాత్రాన వారినే సీసీకి దరఖాస్తు చేసి తీసుకోవాలని చెప్పడం సహేతుకం కాదు’ అని తేల్చి చెప్పింది.
ఈ మేరకు జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ దీపాకంర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కోల్ కతాలోని కైలాష్ ఘోష్ రోడ్డులో ఓ హౌసింగ్ ప్రాజెక్టు ఉంది. అందులో ఫ్లాట్లు కొనుగోలుచేసిన 36 మంది సీసీ రాకముందు వారి ఫ్లాట్లను ఆక్యుపై చేసుకున్నారు. దీంతో సీసీ తీసుకునే బాధ్యత తనకు లేదని.. మీరు అందుకు దరఖాస్తు చేసుకుని తీసుకోవాలని బిల్డర్ వారికి సూచించాడు. దీనిపై వారు ఎన్సీడీఆర్సీని ఆశ్రయించగా.. బిల్డర్ కు అనకూలంగా తీర్పు వెలువడింది. దీనిని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సీసీ బాధ్యత బిల్డర్ దేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ఫ్లాట్ కొనుగోలుదారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా సీసీ రాకముందే ప్లాట్లను ఆక్యుపై చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.