Categories: TOP STORIES

రియాల్టీలో క‌ల‌క‌లం క‌ళ‌క‌ళ కావాలంటే?

  • రియల్ ఎస్టేట్ పై స్పష్టమైన ప్రభుత్వ పాలసీ
  • 111 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి

తెలంగాణ అంటే హైదరాబాద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే భాగ్యనగరం పచ్చగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం కళకళలాడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆదాయమంతా ఒక ఎత్తైతే .. హైదరాబాద్ ఆదాయం మరో ఎత్తు అని చెప్పాలి. హైదరాబాద్ కు రియల్ ఎస్టేట్ ప్రధానమైన ఆదాయ వనరుతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న రంగం. గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్ప‌ట్నుంచి రియాల్టీ స్థ‌బ్దుగానే ఉందని చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భారీ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయోమయ స్థితిలో పడిపోయాయి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. దీంతో గ్రేటర్ సిటీలో నిర్మాణాలు కొనసాగించాలా, లేదంటే కొంతకాలం వేచి చూడటం మంచిదా అని రియల్టర్లు సందిగ్దంలో పడిపోయారు.

నిర్మాణ రంగంతో సంప్రదింపులు..

రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పైగా హైడ్రా అమలుతో హైదరాబాద్ నిర్మాణ పరిశ్రమ డోలాయమాన స్థితిలో పడిపోయింది. దీంతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోతున్నారన్న ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలు దాటినా ఇప్పటి వరకు నిర్మాణ రంగంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా స‌మావేశం కాలేదు. కొంత కాలం క్రితం అమెరికా వెళ్లేట‌ప్పుడు మాదాపూర్‌లోని ఒక హోట‌ల్‌లో క‌లిసినా.. అక్క‌డ ఆయ‌నేం చెప్పారో బ‌య‌టికి రాలేదు.

ఒకరిద్దరు బిల్డర్లు వ్యక్తిగతంగా సీఎం ను కలవడమే తప్ప, రియాల్టీ ఇండస్ట్రీతో మీటింగ్ కు చొరవ తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లోని నిర్మాణ సంస్థలు, రియాల్టీ సంఘాలను పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం హైదరాబాద్ లో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలు, ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై రియాల్టీ వర్గాలతో చర్చిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు నిర్మాణ సంస్థలకు సంబంధించిన వారు ప్రభుత్వానికి.. తమ సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు నిర్మాణ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించొచ్చు.

రియల్ ఎస్టేట్ పై స్పష్టమైన పాలసీ…

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొన్ని అనుమానాలు రావడం సహజమే కావచ్చు. కానీ రియల్ వ్యాపారుల్లో నెలకొన్న అయోమయ స్థితిని తొలగించడం ప్రభుత్వ బాధ్యత అని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మార్కెట్ ను గాడిలో పెట్టే చర్యగా పాత ప్రభుత్వ విధానాలను సమీక్షించి, రియల్ ఎస్టేట్ అనుకూల విధానాలను అమలుకు తీసుకు రావాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడి పది నెలలు దాటినా ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంపై తమ వైఖరిని వెల్లడించలేదు.

అందుకే అధికారులు, రియల్ రంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి, స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించాలని చెబుతున్నారు. అప్పుడే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు, భవిష్యత్తు ప్రణాళికలు తెలిసి అందుకు అనుగుణ‌వ‌గా నిర్మాణ రంగం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని రియాల్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో రియ‌ల్ ఎస్టేట్ పాలసీ రూపకల్పనలో రియాల్టీవర్గ నిపుణులను, జాతీయ స్థాయి రియల్ సంస్థలను భాగస్వాములను చేయాలని సూచిస్తున్నారు.

అనుమతులలో వేగం పెంచాలి…

కొత్త ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జరుగుతున్న జాప్యం తీవ్ర నష్టాలకు దారి తీస్తోందని రియల్ రంగం వాపోతోంది. కొనుక్కున్న స్థలాల్లో ప్రాజెక్టులు నిలిచిపోతే వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని బిల్డ‌ర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివర‌కూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. హైదరాబాద్లో నిర్మాణాలకు సంబంధించిన‌ అన్ని అనుమతుల్ని ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి తూతూ మంత్రంగా సాగుతున్నాయని, అందులో ఉన్న అవరోధాలు తొలగించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ బీపాస్ వ్యవస్థ క్రమంగా నీరుగారిపోతోందన్న ఆరోపణలున్నాయి. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి చొరవ చూపించాలని కోరుతున్నారు. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. నిర్మాణాల అనుమతులు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రియల్ రంగవర్గాలు అభ్యర్ధిస్తున్నాయి.

111 జీవోపై స్పష్టత ఇవ్వాలి..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధానపరంగా స్పష్టత ఇవ్వకుండా వదిలేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవోపై ఇంతవరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 111 జీవో పరిధిలో నిర్మాణాలపై ప్రభుత్వ వైఖరి ఇంకా వెల్లడి కాలేదు. బిల్డర్లు మాత్రమే కాకుండా లక్షలాది మంది సాధారణ పౌరులు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 111 జీవో పరిధిలోని నిర్మాణాలు, సామాన్యులు కొన్న ఇళ్ల స్థలాల విషయంలో ఆందోళన నెలకొంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 111 జీవో పై సాధ్య‌మైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని రియల్ రంగ వర్గాలు కోరుతున్నాయి. అప్పుడే హైదరాబాద్ తదుపరి అభివృద్ది, నిర్మాణ రంగ భవిష్యత్తుపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. 111 జీవో పరిధిలోని సుమారు 1.32 లక్షల ఎకరాలకు సంబంధించిన అంశం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అందరితో సంప్రదింపులు జరిపి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రియాల్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

ఫ్యూచర్ సిటీతో పాటు..

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఫోర్త్ సిటీ-4.O పైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు, పలు రంగాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేసేలా రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతోంది. అయితే కేవలం ఫోర్త్ సిటీపై మాత్రమే దృష్టి పెట్టకుండా హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రియల్ రంగం సూచిస్తోంది. ఐటీ, ఫార్మా వంటి సంస్థలను నగరం నలువైపులా ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటే.. గ్రేటర్ సిటీ అన్ని వైపులా విస్తరిస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సమగ్ర అభివృద్ది ప్రణాళికను ప్రకటించాలని కోరుతున్నారు. భాగ్యనగరం నలువైపులా మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తులను క్లియర్ చేయాలి..

రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ ద‌రఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని రియల్ రంగ వర్గాలు కోరుతున్నాయి. 2020 నుంచి ఎల్ఆర్ఎస్‌‌‌ కింద సుమారు 25.67 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అత్యధికంగా మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, గ్రామ పంచాయతీల పరిధిలో 10.76 లక్షలు, మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తులు ఉండగా.. ఇందులో ఇప్పటివరకు 4.90 లక్షల అప్లికేషన్ల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటిలో 85 వేలలోపు అప్లికేషన్లను ఆమోదించారు. ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై ఇప్పటివరకు సీఎం ఒకసారి, రెవెన్యూ శాఖ మంత్రి మూడు సార్లు సమీక్షలు నిర్వహించినా పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

This website uses cookies.