Categories: CONSTRUCTION

హైరైజ్ నిర్మాణాల్లో ఆధునిక ప‌రిజ్ఞానం

  • హైరైజ్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత
  • హైదరాబాద్ లో భారీగా స్కై స్క్రాపర్స్ నిర్మాణాలు
  • డిజైన్ మరియు ప్లానింగ్ అత్యంత కీలకం
  • నిర్మాణ మెటీరియల్స్ పరీక్షకు ప్రత్యేక ల్యాబ్
  • నిర్మాణంలో భారీ క్రేన్స్-కాంక్రీట్ లిఫ్టులు

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. బడ్జెట్‌కు అనుగుణంగా హైదరాబాద్‌ లాంటి సిటీలో ఎక్కడో ఓ చోట సొంతంగా ఇల్లు కట్టుకోవాలని.. లేదంటే కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది. ఇంటి ధర కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ విశాలంగా, గాల్లో తేలియాడే ఫీలింగ్ వచ్చేలా ఫ్లాట్ ఉండాలంటున్నారు. దీంతో హైరైజ్ అపార్ట్‌మెంట్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ప్రీమియం ఫ్లాట్ల వైపు మొగ్గుచూపుతుండటంతో బిల్డర్లు సైతం…. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. అసలు హైరైజ్‌ అపార్ట్‌మెంట్స్‌ను ఎలా నిర్మిస్తారు..? డిజైన్‌, ప్లానింగ్, మెటిరియల్‌, టెక్నాలజీ, భద్రత.. ఇలాంటి అంశాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒకసారి చూద్దాం..

హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో చూసినా ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. 20 అంతస్తులపైనే నివాస, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో 50 అంతస్తులు ఆపై ఎత్తు దాటి ఇంకా పైకి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో హైరైజ్ అపార్ట్ మెంట్స్ అభివృద్ధికి నిదర్శనంగా, ఐకానిక్‌ టవర్లుగా నిలుస్తున్నాయి. ఆకాశహర్మ్యాలలో నివాసం సామాజిక హోదాగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రీలాంచ్‌ ఆఫర్లలో ఎక్కువగా హైరైజ్ అపార్ట్ మెంట్ ప్రాజెక్టులే ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనాలన్నీ అధికంగా ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల వస్తున్నాయి.

ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉండటంతో బిల్డర్లు ఆ మేరకు అంతస్తులు పెంచుకుంటూ వెళుతున్నారు. ఇక్కడ కొత్తగా కట్టే ప్రతి భవనం 30 అంతస్తుల పైనే ఉంటోంది. ఎత్తుపై ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ పరిమితులు లేకపోవడంతో ఆకాశమే హద్దుగా నివాస, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. మామూలు భవనాలతో పోలిస్తే ఆకాశ హర్మ్యాల నిర్మాణం పక్కా ప్రణాళికతో చేపట్టాలి. వాస్తవానికి హైరైజ్ అపార్ట్ మెంట్స్ నిర్మాణ తీరే పూర్తిగా మార్చాల్సి ఉంటుందని నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు. ఆకాశహర్మ్యాల నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించాల్సి ఉంటుందని అంటున్నారు.

ముప్పై లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు అంటే 150 మీటర్లు – 490 అడుగులు కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను స్కై స్క్రాపర్స్ లేదంటే ఆకాశహర్మ్యాలు అంటారు. అందుకే ఎత్తైన భవనాల పునాదులు భారీ గురుత్వాకర్షణ భారాలను తట్టుకునేంత బలంగా ఉండాలి. హైరైజ్ భవనాలు బలమైన గాలులు, భూకంపాలు తట్టుకుని నిలబడేలా అత్యంత ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణంలో డిజైన్, భద్రత, నాణ్యత, ఫైర్ సేఫ్టీ , విద్యుత్ సరఫరా, ఎలివేటర్స్, నీటి వ్యవస్థ ప్రధాన పాత్రలు పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులో మొత్తం ఎనిమిది వ్యవస్థలు అత్యంత కీలకమైనవిగా చెప్పాలి.

1.డిజైన్ మరియు ప్లానింగ్..

ఎత్తైన భవనాలు, ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్స్‌ నిర్మించాలంటే మొదట దాని ప్లానింగ్ అనేది ముఖ్యమైంది. హైరైజ్‌ అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణం డిజైన్‌ చేయడంలో ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మరియు ఇతరులతో సహా అనేక మంది పాత్ర ఉంటుంది. వీరంతా భవన నిర్మాణానికి సంబంధించి మంచి డిజైన్‌ రూపొందించి, సురక్షితమైన భవనాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

ఎక్కడైతే హైరైజ్‌ అపార్ట్‌మెంట్ నిర్మించాలనుకుంటున్నారో అక్కడి వాతావరణం, భూమిని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడి వాతావరణానికి తగినట్లు నిర్మాణాన్ని చేసేందుకు ప్లానింగ్‌ అండ్ డిజైన్‌ను రూపొందిస్తారు. ఆ తర్వాత డిజైన్‌ ను డ్రాయింగ్‌ చేసి, అధికారుల నుంచి పర్మిషన్‌ తీసుకుంటారు. ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఏ ఫ్లోర్‌లో సౌకర్యాలు ఎలా ఉండాలి? అసలు బడ్జెట్‌ ఎంత కేటాయించాలనేది కూడా నిర్ణయించుకుంటారు.

2.సైట్ తయారీ

ఎత్తైన భవనాల నిర్మాణంలో సైట్ తయారీ తదుపరి దశ అని చెప్పాలి. అక్కడ భూమి స్వభావం, నాణ్యత, పునాదులు తవ్వితే అనుకూల-ప్రతికూల అంశాలపై నిశింతగా పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఏదైనా హైరెజ్‌ అపార్ట్‌మెంట్స్‌కు దాని పునాది కీలకం. ఎందుకంటే పునాది బిల్డింగ్ యొక్క బలాన్ని నిర్ణయిస్తుంది. పునాది వ్యవస్థ సైట్ యొక్క భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పునాది ఎంత బలంగా ఉంటే బిల్డింగ్ అంత ఎక్కువకాలం పటిష్టంగా ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉంటే భవన నిర్మాణానికి సంబందించిన సైట్ క్లియరింగ్, త్రవ్వకం, పునాది మరియు పిల్లర్స్ ను నిర్మించడానికి సిద్దమవుతారు.

3.నిర్మాణ వ్యవస్థ

హైరైజ్ భవనానికి నిర్మాణ వ్యవస్థ బ్యాక్‌బోన్‌ లాంటిది. హైరెజ్‌ అపార్ట్‌మెంట్ అంటే.. మినిమం 30 నుంచి 50 అంతస్తులు ఉంటుంది కాబట్టి .. ఆ రేంజ్‌లో బరువును తట్టుకునేలా బిల్డింగ్ నిర్మాణం చేపడుతారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు గాలి బీభత్సం, అగ్నిప్రమాదాలు, భూకంపకాలు, వరదలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు వాటన్నింటని తట్టుకునేలా నిర్మిస్తారు. భవన నిర్మాణానికి ఉపయోగించే సాంకేతికత, ఇంజినీరింగ్ వ్యవస్థ, అత్యాధునిక ఎక్విప్మెంట్స్ విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు.

4.మెటీరియల్స్

సాధారంగా ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించే సమయంలోనే మంచి మెటీరియల్ వాడేందుకు ప్రీయారిటీ ఇస్తాం. మరి అలాంటి 30 నుంచి 50 అంతస్తులు ఆపై భవనాలు నిర్మించే సమయంలో పటిష్టంగా ఉండాలంటే ఏ రేంజ్‌లో మెటీరియల్ వాడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎత్తైన భవనాల నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్ నుంచి మొదలు స్టీల్, కాంక్రీటు, గ్లాస్ వంటి మెటీరియల్ విషయంలో పక్కాగా క్వాలిటీ చెక్స్ తరువాత నిర్మాణానికి ఉపయోగిస్తారు. బిల్డింగ్ మెటీరియల్ నిర్మాణ సామగ్రి క్వాలిటీ చెకింగ్ కోసం ప్రత్యేకంగా ల్యాబ్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థలు.

5.నిర్మాణ సాంకేతికతలు

హైరైజ్ భవనాల నిర్మాణం మాములు విషయం కాదు. చిన్న చిన్న మిషనరీ వాడితే అయ్యే పనికాదు. పెద్ద పెద్ద క్రేన్లను వాడుతారు. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో ప్రతేక పరికరాలను వినియోగిస్తారు. మొదట కింది అంతస్తులు నిర్మాణం తరువాత పై అంతస్తులు నిర్మించడానికి భారీ క్రేన్ లతో కన్ స్ట్రక్షన్ మెటీరియల్ తరలించడానికి భారీ క్రేన్స్ తో పాటు కాంక్రీట్ లిఫ్ట్ చేయడానికి అత్యాధునికమైన లిప్టులను ఉపయోగిస్తారు. అంతే కాకుండా భారి ఎత్తున కాంక్రీట్ రెడీ మిక్స్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసుకుంటాయి నిర్మాణ సంస్థలు. ఇది నిర్మాణ ప్రక్రియ మెరుగైన నియంత్రణను, అలాగే మెరుగైన భద్రతను కలిగి ఉంటుంది

6.భద్రతా చర్యలు

హైరైజ్ అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణం అనేక సవాళ్లతో కూడుకుని ఉన్న ప్రాజెక్టు. అందుకే ఎత్తైన భవనాల నిర్మాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రమాదాలు నివారించేందుకు నివారణ చర్యలు చేపడుతారు. భవనాల నిర్మాణంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా విస్తృతమైన భద్రతా శిక్షణను పొందుతారు. ట్రైనింగ్ తీసుకున్న వారినే ఎత్తైన భవనాల నిర్మాణంలో పనిచేసేందుకు అనుమతిస్తారు. అలాగే భవనాన్ని అగ్ని, భూకంపకాలను తట్టుకునేలా నిర్మిస్తారు. ప్లానింగ్ మరియు డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అమలు చేస్తారు. ఇది ఇంజనీర్లకు కూడా పెద్ద సవాలేనని చెప్పాలి.

7- భవన సామర్ధ్యం

అత్యంత ఎత్తైన భవన నిర్మాణం సమయంలో ప్రతి స్టేజ్ లోను భవన సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. నిర్మాణంలో అంతస్థులు పెరుగుతున్న ప్రతి సందర్బంలో భవనం యొక్క బరువు, దాని పరిస్థితులను ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలిస్తారు. ఆర్కిటెక్చర్ డిజైన్ సమయంలోనే మొత్తం భవన బరువును అంచనా వేసి అందుకు అనుగుణంగా నిర్మాణ సందర్బంగా ప్రతికూలతలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. భారీ భవన నిర్మాణం పూర్తైన తరువాత కూడా అక్కడ భుమి స్వభావం, సామర్ధ్యంలో ఏమైనా మార్పులు సంభవించాయా అన్న కోణంలోను పరిక్షలు నిర్వహిస్తారు ఇంజినీరింగ్ నిపుణులు.

8- ఫైర్ సేఫ్టీ

ఆకాశహర్మ్యాల భవనాల చుట్టూ 7 మీటర్ల సెట్‌ బ్యాక్‌ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. అందుకు అనుగుణంగా భారీ భవనాల నిర్మాణాలు క్రమబధ్దమైన చుట్టు కొలతలతో నిర్మిస్తారు. ఒకవేళ అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రం తిరిగేందుకు వీలుగా నిర్మాణం ఉంటుంది. అంతే కాకుండా భవనంలోను అత్యాధునికమైన ఫైర్ సెఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు అత్యాధునిక లిఫ్టులతో పాటు ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్టులను ఉపయోగిస్తారు.

హైరైజ్ భవనాల గురించి చివరగా…

ఇక ఆకాశహర్మ్యాలను తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తుంటారు. సాధారణంగా మూడొంతుల స్థలాన్ని ఖాళీగా వదులుతుంటారు. క్లబ్‌ హౌస్, క్రీడా సదుపాయాలు, షాపింగ్, ఆసుపత్రి వంటి వాటికి స్థలాన్ని కేటాయిస్తుంటారు. అందులో నివసించే వారికి కనీస అవసరాలన్నీ అక్కడే దొరికేలా ఏర్పాట్లు ఉంటాయి. సాధారణ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఈ తరహా గేటెడ్‌ హైరైజ్‌ భవనాల్లో నిర్వహణ వ్యయం అధికంగానే ఉంటుంది. అక్కడ ఉండే ఆవాసాలు, కల్పించే సౌకర్యాలు, ప్రాజెక్ట్‌ను బట్టి ఈ వ్యయాలు వేర్వేరుగా ఉంటాయి. కొనేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.