poulomi avante poulomi avante

ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ నిర్మాణం

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా ఫోర్త్ సిటీని నిర్మించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో అద్భుతమైన నగరం నిర్మించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీలో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం అవ్వగా, వచ్చే యేడాది కాలంలో ఫ్యూచర్ సిటీలోని యూనివర్సిటీ భవనాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్.

ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ నిర్మాణంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని ఏఐ రూల్ చేస్తుందని అంచనా వేస్తున్న రేవంత్ సర్కార్.. ప్రపంచంలోనే ది బెస్ట్ ఏఐ సిటీని ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి మార్చి నెలలో ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి శంఖుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ శాఖ శరవేగంగా చేస్తోంది. మొత్తం 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.

ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న ఏఐ సిటీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా ఇప్పటికే ఏఐ సిటీలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్‌ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఫ్యూచర్ సిటీలో 3500 కోట్ల పెట్టుబడితో నిర్మించేందుకు సిద్ధమైంది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఏఐ సిటీలో తమ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫోర్త్ సిటీలోని ఏఐ సిటీలో సుమారు 20 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మెడికల్ సిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉండటం.. మిగతా సేకరణ కూడా పూర్తి చేయాలని నిర్ణయించడంతో కొన్ని వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. అక్కడ పూర్తి స్థాయిలో ప్రణాళికా బద్దమైన అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, మెడికల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజమ్ హబ్, ఐటీ డేటా సెంటర్స్.. ఇలా చాలా రంగాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఫ్యూచర్ సిటీవైపు అందరు చూపు మళ్లుతోంది. రానున్న రోజుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లంతా ఫోర్త్‌ సిటీ వైపు చూడనున్నారని అంచనా వేస్తున్నారు.

ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కొంగరకలాన్, కప్పపహాడ్, ఫిరోజ్‌గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాలను తీసుకురానున్నారు. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావటంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్లు ధర పలుకుతుండగా.. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles