ఓ వైపు అవుటర్ రింగ్ రోడ్డు.. మరోవైపు టీసీఎస్ లాంటి ప్రఖ్యాత సంస్థలు.. సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ఓ ప్రాంతం అభివృద్ది చెందడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వీటికి తోడు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా రావడంతో ఆదిభట్ల రూపురేఖలే మారిపోతున్నాయి. అవును ఇప్పటికే నివాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆదిభట్ల, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో మరింత దూసుకుపోతోంది. ఇప్పటి వరకు కేవలం రెసిడెన్షియల్ కేంద్రంగా ఉన్న ఆదిభట్ల ప్రస్తుతం కమర్షియల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. నగరం అన్ని వైపులా నిర్మాణరంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఆదిభట్ల పరిసరాల్లో రియాల్టీ బాగా పుంజుకుంది. ఇప్పటికే ఆదిభట్ల చుట్టుపక్కల భారీగా నివాస సముదాయాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయం సైతం అందుబాటులోకి వచ్చింది. కలెక్టరేట్‌కు సమీపంలోని స్థలాలు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదిభట్ల అవుటర్ రింగురోడ్డు నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఖాళీ స్థలాలపై స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వెంచర్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 20కి పైగా కొత్త వెంచర్లు వస్తున్నాయి. గతంలో 20 నుంచి 25 వేలుగా ఉన్న చదరపు గజం విలువ ఇప్పుడు 30 నుంచి 50 శాతం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాక ఆదిభట్లలో ఇంటి స్థలాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రస్తుతం చదరపు గజం 35 నుంచి 45 వేల రూపాయల మధ్య ధరలు పలుకుతున్నాయి.
* ఆదిభట్లలో భూముల విలువ సైతం భారీగా పెరిగింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో ఎకరం 8 నుంచి 12 కోట్ల వరకు ధర పలుకుతోంది. కలెక్టరేట్ అవుటర్ రింగురోడ్డుకు చేరువలో ఉండటం బాగా కలిసివస్తోంది. కొంగరకలాన్, ఆదిభట్ల, రావిర్యాల గ్రామాలకు సమీపంలో ఉండటంతో ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతోంది. ఇప్పటికే ఆదిభట్లలో టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు ఉండటం, ఎలక్ట్రానిక్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌తో పాటు పారిశ్రామిక అభివృద్ధి సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఆదిభట్లలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని మధ్యతరగతి వారు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
* మరోవైపు ఆదిభట్ల పరిసర ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు అపార్ట్‌మెంట్స్, ఇండిపెండెంట్ హోమ్స్, విల్లాల నిర్మాణం చేపట్టాయి. సుమారు 15 వరకు నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల ధరలు సైతం ఇక్కడ అందుబాటులో ఉండటంతో అందరి దృష్టి ఆదిభట్లపై పడింది. డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ 55 లక్షల రూపాయల నుంచి మొదలవుతుండగా, ఇండిపెండెంట్ హౌస్ 80 లక్షలు, విల్లా ఐతే కోటీ 40 లక్షల రూపాయల నుంచి మొదలవుతున్నాయి. భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింతగా పెరగనుండటంతో చాలామంది తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఇంటి స్థలాలు, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.