Categories: TOP STORIES

ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో మరో ముందడుగు..

ఉత్తర భాగానికి అటవీ అనుమతులు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన‌ అటవీ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ వచ్చంది. ఈ మేరకు రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ దక్షిణ, ఉత్తర భాగాల నిర్మాణానికి నిన్నటి వరకు ఉన్న అటవీశాఖ అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది ట్రిపుల్ ఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేలా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరీ చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్, ఐఎఫ్ఎస్ లేఖ రూపంలో తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పంపిన లేఖలో రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) కు ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తూ.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

అటవీ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 26.07.2024 తేదీన పంపించిన FP/TG/ROAD/489876/2024 ఆన్‌లైన్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు అటవీ సంరక్షణ చట్టం-1980 లోని సెక్షన్ ‘2’ ప్రకారం పరిశీలించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం-1980 చట్టం క్రింద ఏర్పాటు చేసిన అటవీ సంరక్షణ చట్టం-2023 లోని నియమం 10 క్రింద ఏర్పాటు చేసిన రీజినల్ ఎంపవర్డ్ కమిటీ (REC) అనుమతులను మంజూరు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు.

19 సెప్టెంబర్ 2024 న జరిగిన 69వ సమావేశంలో REC ఈ అంశాన్ని చర్చించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు పత్రాలను పరిశీలించి, ఈ ప్రతిపాదనకు అటవీ సంరక్షణ చట్టం-1980 లోని సెక్షన్ ‘2’ క్రింద “ఇన్-ప్రిన్సిపల్” అనుమతిని మంజూరు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిందని మంత్రి వివరించారు. ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, మరియు యాదాద్రి-భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు మొత్తంగా మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్‌మాల పరియోజన ఫేజ్-1 కింద ఎన్.హెచ్.ఏ.ఐ క్రింద పీఐయూ (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) గజ్వేల్, ప్రయోజనార్థం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (HRRR) నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి తెలియజేశారు.

అందుకు సంబంధించిన వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక ఎన్.హెచ్.ఏ.ఐ వద్ద పెండింగ్ లో ఉన్న టెక్నికల్ అప్రూవల్ వస్తే.. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని వివరించారు.

ఇక రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటిదాక 90 శాతం భూసేకరణ పూర్తయ్యిందని.. కొన్ని చిన్న చిన్న కోర్టు కేసుల భూములను త్వరలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు అటవీ అనుమతులు రావడంతో ఇక రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడటంతో రియల్ ఎస్టేట్ రంగం సైతం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భూముల ధరలు క్రమంగా పెరుగుతుండగా.. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

This website uses cookies.