పెరుగుతున్న కూల్ రూఫ్ టైల్స్ వినియోగం
చదరపు అడుగుకు రూ.60 నుంచి మొదలు
ఏప్రిల్ ప్రారంభ కాకముందు నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకా రాబోయే రెండు నెలలూ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఫ్యాన్లు, ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలు లేనివారు ఉక్కపోతకు, ఎండ వేడికి తాళలేక సతమతమవుతున్నారు. అలాంటివారి కోసం ఇప్పటివరకు కూల్ రూఫ్ పెయింట్ వంటి మార్గాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు కూల్ రూఫ్ టైల్స్ మరో ప్రత్నామ్నాయంగా నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది.
ప్రస్తుతం నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడం, ఊళ్లలోనూ శ్లాబు ఇళ్లే ఉండటంతో ఇంట్లో వేడి పెరిగింది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలకు రాకుండా ఇవేవీ అడ్డుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వేడిని నిరోధించేందుకు కూల్ రూఫ్ టైల్స్ వినియోగిస్తున్నారు. డాబాపై వీటిని వేయించుకోవడం ద్వారా లోపల వేడి గణనీయంగా తగ్గించుకోవడం వీలవుతుంది. సాధారణంగా సూర్యకిరణాలు శ్లాబ్ పై పడి.. ఆ వేడి లోపలకు వస్తుంది. కానీ ఈ కూల్ రూఫ్ టైల్స్ వేసుకుంటే పైకప్పుపై పడిన సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయి. దీంతో ఇంట్లోకి వచ్చే వేడి తగ్గుతుంది.
కూల్ రూఫ్ టైల్స్ వేయించకముందుతో పోలిస్తే.. వీటిన వేయించిన తర్వాత గది లోపల ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీలు, పైకప్పు ఉపరిత ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. ఇందులోనూ చాలా రకాలున్నాయి. సాధారణం, యాంటీ స్క్విడ్, మ్యాట్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రంగులు, డిజైన్లు కూడా లభిస్తున్నాయి. కానీ తెలుపు రంగుకు దగ్గరగా ఉన్న టైల్స్ అయితేనే మంచిది. తెలుపు రంగు టైల్స్ సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ (ఎస్ఆర్ఐ) 90 కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మిగిలిన రంగుల టైల్స్ ఎస్ఆర్ఐ 75 నుంచి 90 లోపు ఉంటుంది. ఎస్ఆర్ఐ ఎంత ఎక్కువగా ఉంటే ఇంట్లోకి వచ్చే వేడి అంతమేర తగ్గుతుంది. ఇక కూల్ రూఫ్ టైల్స్ ధరలు చదరపు అడుగుకు రూ.60 నుంచి మొదలవుతున్నాయి. ఇక వీటిని అమర్చేందుకు చదరపు అడుగుకు రూ.60 వరకు తీసుకుంటున్నారు. ఈ కూల్ రూఫ్ టైల్స్ ని ఒకసారి ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. టైల్స్ నాచు పట్టకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే మరింతకాలం మన్నుతాయని పేర్కొంటున్నారు.
This website uses cookies.