Categories: TOP STORIES

నిర్మాణ రంగం నిలబడుతుందా?

  • దడ పుట్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్
  • డెవలపర్లు ఎలా తట్టుకుంటారు?
  • ఈ మహమ్మారిని తట్టుకునే ప్రణాళికలేమిటి..
  • అమ్మకాలు లేకపోయినా ఫర్వాలేదా?
కింగ్ జాన్సన్ కొయ్యడ

కొవిడ్ సెకండ్ వేవ్ తెలంగాణ నిర్మాణ రంగానికి మళ్లీ చుక్కలు చూపిస్తోందా? ఒకవైపు అమ్మకాలు తగ్గిపోయి.. కొనుగోలుదారులు చెల్లింపులు చేయక.. బ్యాంకులు నిధులు విడుదల చేయక.. హైదరాబాద్ నిర్మాణ రంగం కుదేలవుతోందా? గత మూడు నెలలుగా కోలుకుంటున్న రియల్ మార్కెట్ మళ్లీ ఢమాల్ అయ్యే అవకాశముందా? భారతదేశానికే కీలకమైన ఈ నెలను తట్టుకుని మన నిర్మాణ రంగం నిలబడుతుందా? ఇందుకోసం వివిధ సంస్థలు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నాయి?

సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్థానికంగా నెలకొనే నియంత్రణ, పాక్షిక మూసివేత వంటి అంశాల వల్ల కీలకమైన ప్రాంతాల్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతాయి. కాకపోతే, గత కొద్ది నెలల్నుంచి తగ్గిన బ్యాంకు వడ్డీ రేట్లు, డెవలపర్లు అందజేస్తున్న రాయితీలు వంటి అంశాల వల్ల కొందరు కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి వెనకడుగు వేయకపోవచ్చు. ఖరీదైన ఇళ్ల అమ్మకాలూ గణనీయంగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో.. పలువురు డెవలపర్లు రూ.2 కోట్ల నుంచి ఫ్లాట్లు, రూ.5 కోట్ల నుంచి విల్లాల్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటిని కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రాకపోవచ్చు.

రాయితీలను ప్రకటిస్తే రయ్ రయ్..

మార్కెట్ మళ్లీ ఎప్పుడు గాడిలో పడుతుందనే అంశం మాత్రం ప్రభుత్వం నిర్వహించే కొవిడ్ వ్యాక్సీనేషన్ కార్యక్రమం మీద ఆధారపడుతుంది. అందుకే, అధిక శాతం మంది డెవలపర్లు ప్రభుత్వం వేసే అడుగుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ, కరోనా వ్యాక్సీన్ కార్యక్రమంలో తెలంగాణలో మెరుగ్గా జరిగితే రియల్ రంగం త్వరగా కోలుకుంటుంది. ఈ కార్యక్రమం నత్తనడక సాగితే మాత్రం ప్రజల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇళ్లను కొనడానికి ముందుకు రారు. అయితే, ఇప్పటికే సొంతిల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చినవారు మాత్రం.. కొవిడ్ వల్ల ఒకట్రెండు నెలలు తాత్కాలికంగా వెనకడుగు వేసినా.. మార్కెట్ మెరుగవ్వగానే మళ్లీ సొంతింటి వేటను ఆరంభిస్తారు. సరిగ్గా ప్రతికూల సమయాల్లో డెవలపర్లు ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటిస్తే.. అధిక శాతం మంది ఆన్ లైన్ ద్వారా ఇళ్లను కొంటారు. కాకపోతే, ప్రముఖ సంస్థల వద్ద మాత్రమే ఈ తరహా కొనుగోళ్లు ఎక్కువ జరిగేందుకు ఆస్కారముంది.

పనుల్లో జోరు..

నిర్మాణ సామగ్రి రాకపోకల విషయంలో ఎలాంటి ఆంక్షల్లేకపోవడం రియల్ సంస్థలకు కలిసొచ్చింది. అధిక శాతం మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాజెక్టుల్లోనే నివసించడం పలు సంస్థలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఈ నెలలో నిర్మాణ పనుల్లో జోరును పెంచుతామని పలువురు డెవలపర్లు అంటున్నారు. మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనగానే.. ప్రాజెక్టు పనుల్లో పురోగతిని బట్టి కొనుగోలుదారులే కొంటారని పలువురు డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, ఈ ఒకట్రెండు నెలల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టినా ఫర్వాలేదంటున్నారు. వచ్చే పండగ సీజన్ లోపు నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తే ఆ తర్వాత అమ్మకాలు దానంతట అవే జరుగుతాయని విశ్లేషిస్తున్నారు.

This website uses cookies.