ఇప్పుడే కాదు.. గతంలోనూ.. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలోనే రియల్ రంగానికి అధిక గిరాకీ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడంతో ఇక పెట్టుబడిదారుల ఆలోచనలన్నీ వైజాగ్ వైపే ఉన్నాయి. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఆరంభమైన రో హౌజెస్ కు విశాఖలో గిరాకీ ఎక్కవుండేది. తాజాగా, లగ్జరీ విల్లాలకు ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది.
ఒకప్పుడు మధురవాడలో వరుసగా వ్యక్తిగత ఇండ్లను కట్టారు. తర్వాత గాజువాక, పీఎంపాలెం, మధురవాడ, కాపులుప్పాడ, భీమిలీలో విల్లాల నిర్మాణాలు పెరిగాయి. తాజాగా తూర్పు వైజాగ్లో విల్లాల్ని నిర్మించే సంస్థలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం వైజాగ్ సిటీలో సుమారు పది శాతం లోపు ప్రజలు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరని నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రవాసాంధ్రులు, ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి విల్లాల్ని కొనేవారి జాబితాలో ఉంటారని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒరిస్సా కు చెందిన వ్యాపారులూ విల్లాల్ని కొనేందుకు ముందుకొస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారడంతో.. రాయలసీమతో పాటు ఇతర జిల్లాలకు చెందినవారు వైజాగ్లో విల్లాల్ని తీసుకుంటున్నారు.
నిన్నటి వరకూ సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి అధిక విస్తీర్ణం కలిగిన ప్లాట్లను కొనుగోలు చేయాలని భావించేవారి ఆలోచనల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. పెరిగిన స్థలాల ధరల నేపథ్యంలో, ప్రస్తుతం ఎక్కువ శాతం మంది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అంటే, పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో ఎలాగైతే ప్రవాసాంధ్రులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ద్రుష్టి సారించేవారో.. అదేవిధంగా ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. కొనుగోలుదారులు వైజాగ్లో విల్లాల్ని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. వైజాగ్లో విల్లా ఆరంభ ధర ఎంతలేదన్నా రూ. 2.5 కోట్ల దాకా ఉంటుంది. మధురవాడ వంటి ప్రాంతంలో విల్లా రేటు సుమారు రూ.3 కోట్ల నుంచి ఆరంభమవుతుందని సమాచారం. కాకపోతే, ఆయా గేటెడ్ ప్రాజెక్టులో పొందుపరిచే సదుపాయాలు, సౌక్యర్యాలు, డిజైన్, ఎలివేషన్ వంటి అంశాల్ని బట్టి తుది రేటు ఆధారపడుతుంది.
This website uses cookies.