Categories: LATEST UPDATES

కొనసాగుతున్న ధరల పెంపు

  • 2022 మూడో త్రైమాసికంలో 6 శాతం వృద్ధి
  • అత్యధికంగా ఢిల్లీలో 14 శాతం పెరుగుదల
  • విక్రయం కాని ఇన్వెంటరీలోనూ 3 శాతం వృద్ధి
  • క్రెడాయ్-కొలియర్స్-లియాసెస్ ఫోరస్ హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదికలో వెల్లడి

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏటా 6 శాతం చొప్పున పెరుగుతున్నాయని క్రెడాయ్-కొలియర్స్-లియాసెస్ ఫోరస్ హౌసింగ్ ప్రైస్ ట్రాకర్-2022 నివేదికలో వెల్లడైంది. హౌసింగ్ డిమాండ్ ఎక్కువగా ఉండటం, ప్రముఖ డెవలపర్లు నాణ్యమైన నిర్మాణాలు నిర్మిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. నిజానికి 2022 ఆరంభం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది నుంచి డిమాండ్ పెరగడం, అలాగే నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశానికి ఎగబాకడంతో హౌసింగ్ ధరలు కూడా పెరుగుతున్నాయి.

రెసిడెన్షియల్ ధరల్లో ఢిల్లీ అత్యధికంగా 14 శాతం, కోల్ కతాలో 12 శాతం, అహ్మదాబాద్ లో 11 శాతం చొప్పున ధరలు పెరిగాయి. ఈ ఏడాది మొదటి నుంచే వడ్డీ రేట్లు, నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నప్పటికీ మార్కెట్ ఊపందుకోవడంతో నూతన నిర్మాణాలు కూడా జోరుగా సాగాయి. ఈ క్రమంలో విక్రయం కాని ఇన్వెంటరీ ఏటా 3 శాతం చొప్పున పెరుగుతోంది. గత కొన్ని త్రైమాసికాలుగా నూతన నిర్మాణాల్లో పెరుగుదల చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలోని విక్రయం కాని ఇన్వెంటరీలో దాదాపు 94 శాతం నిర్మాణాల్లో ఉన్నవే. మరోవైపు పలు నగరాలు అన్ సోల్డ్ ఇన్వెంటరీలో తగ్గుదల చూశాయి. బెంగళూరులో అధిక విక్రయాల వల్ల అన్ సోల్డ్ ఇన్వెంటరీ ఏటా 14 శాతం చొప్పున తగ్గింది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ లలో మాత్రమే గణనీయమైన నూతన నిర్మాణాల నేపథ్యంలో అన్ సోల్డ్ ఇన్వెంటరీలో పెరుగుదల నమోదైంది. విక్రయం కాని ఇన్వెంటరీ ముంబైలో అత్యధికంగా 37 శాతం ఉండగా.. ఢిల్లీ, పుణెలలో ఇది 13 శాతంగా ఉంది.

టాప్ లో ఢిల్లీ..

ధరల పెరుగుదల విషయంలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. 2022 మూడో త్రైమాసికంలో అత్యధిక పెరుగుదలను చూసింది. ఇక్కడ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలో ఏటా 14 శాతం చొప్పున ధరలు పెరుగుతున్నాయి. అన్ సోల్డ్ ఇన్వెంటరీ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి 11 శాతం మేర తగ్గింది. ఇక ముంబైలో అన్ సోల్డ్ ఇన్వెంటరీ ఏటా 21 శాతం చొప్పున పెరుగుతోంది. బెంగళూరు విషయానికి వస్తే.. ఇక్కడ హౌసింగ్ ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉండగా, విక్రయం కాని ఇన్వెంటరీ ఏటా 14 శాతం చొప్పున పెరుగుతోంది. గణనీయంగా నూతన నిర్మాణాలు రావడంతో వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా అన్ సోల్డ్ ఇన్వెంటరీలో వృద్ధి నమోదైంది.

ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ పటోడియా మాట్లాడుతూ.. కొనుగోలుదారుల సెంటిమెంట్ పరంగా దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్లలో మంచి రికవరీ నమోదైందని పేర్కొన్నారు. ‘అద్దె ఇళ్ల కంటే సొంత ఇంట్లో ఉండటం మేలని కరోనా తర్వాత ప్రజలు భావించడం మొదలుపెట్టారు. దీంతో మార్కెట్ దూసుకెళ్తోంది. పండగ సీజన్ ఈ ఏడాది చివరి వరకూ కొనసాగే అవకాశం ఉంది. విక్రయాలు అధికం కానున్నాయి. దీంతో విక్రయం కాని ఇన్వెంటరీలు తగ్గిపోనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ధోరణులకు అనుగుణంగా హౌసింగ్ ధరల్లో పెరుగుదల చోటుచేసుకున్నప్పటికీ, ముమ్మర డిమాండ్ కారణంగా రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. గత రెండేళ్ల అనిశ్చితి తొలగిపోయిన తర్వాత దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ మార్కెట్ రివకరీ అయింది.

ద్రవ్యోల్బణం పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడం దేశవ్యాప్తంగా హౌసింగ్ ధరలపై ఒత్తిడి పెంచాయి. అయినప్పటికీ, పలువురు డెవలపర్లు ప్రాజెక్టులు ప్రారంభించారు. ఆవాస రంగ కార్యకలాపాలు పటిష్టంగా కొనసాగనున్నప్పటికీ, వేతన జీవులపై ఆర్థికమాంద్యం ప్రభావం బాగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్లు కొనేవారిలో వీరే ఎక్కువగా ఉంటారు’ అని కొలియర్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెట్ డెవలప్ మెంట్ ఎండీ రమేశ్ నాయర్ తెలిపారు. 2022 మూడు త్రైమాసికాల మొత్తం విక్రయాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం అధికంగా ఉన్నాయని లియాసెస్ ఫోరస్ ఎండీ పంకజ్ కపూర్ పేర్కొన్నారు.

This website uses cookies.