Categories: EXCLUSIVE INTERVIEWS

ఈక్విటీ విషయంలో జాగ్రత్త

రియల్ ఎస్టేట్ లేదా ఏ వ్యాపారమైనా సరే ఈక్విటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శోభా రియల్టీ ఫౌండర్ పీఎన్సీ మీనన్ పేర్కొన్నారు. అబుదాబీలో క్రెడాయ్ నేషనల్ నిర్వహించిన నాట్ కాన్-2022 సదస్సులో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘నా ప్రయాణం గురించి చెప్పాలంటే 47 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. నేను గత 47 ఏళ్లుగా గల్ఫ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడకు రాక ముందు ఓసారి కొచ్చిలోని ఓ హోటల్ లాబీలో సులేమాన్ అనే వ్యక్తిని కలిశాను. ఆయన ఓ చేపల పడవను కొనడానికి కేరళ వచ్చారు. అదే నా గల్ఫ్ ప్రయాణానికి నాంది అయింది. వాస్తవానికి ఇండియా బయటక వెళ్లి ఏం చేయాలనేదానిపై నాకు అప్పుడు ఎలాంటి ప్రణాళికలూ లేవు. తొలుత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసిన తర్వాత రెండు మూడు నెలల్లో మస్కట్ వచ్చాను. విమానంలో మస్కట్ వస్తున్నప్పుడు ఎడారి చూశాను. చాలా బాధ అనిపించింది. తొలి నాళ్లలో నా ప్రయాణం చాలా కష్టంగా సాగింది. అవన్నీ చెప్తే సమయం సరిపోదు. కాబట్టి నేరుగా వివరాల్లోకి వద్దాం.

ఈక్విటీ లేకుండా ఎలాంటి వ్యాపారం చేయలేమనేది సత్యం. సరైన ఈక్విటీ లేకపోవడమే చాలామంది వ్యాపారస్తుల ఫెయిల్యూర్ కి కారణం. నిజానికి ఏ వ్యాపారంలోనైనా అప్పు చేయడం తప్పదు. రియల్ ఎస్టేట్ లో కూడా అది లేకుండా కుదరదు. అయితే, మొత్తం పెట్టుబడిలో 40 శాతానికి మించి అప్పు ఉండకూడదు. మీ ఈక్విటీ 65 శాతం, అప్పు 35 శాతం ఉంటే అది సరైన లెక్క. ఇక ల్యాండ్ స్టాక్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ భూమి నచ్చిందని కొనేయడం.. మరోచోట అమ్మకానికి వచ్చిందని చెప్పి చాలామంది తీసేసుకుంటారు. ఈ విషయంలో చాలా క్రమశిక్షణ ఉండాలి. దుబాయ్ ను ఉదాహరణగా తీసుకుంటే నాలుగేళ్లకు మించి ఉంచుకోకూడదు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి మేం 2.13 బిలియన్ డాలర్ల అమ్మకాలు పూర్తి చేయనున్నాం. దుబాయ్ లో మేం అనుకున్నది సాధించామని నేను నమ్ముతాను.

దుబాయ్ లో పోటీని ఎలా తట్టుకున్నామంటే?

ఎమారస్ చాలా పెద్ద బ్రాండ్. వారేం చేస్తున్నారు? మేం ఏం చేయాలి అని ఆలోచించాం. ఆ మేరకు బెంచ్ మార్క్ నిర్దేశించుకున్నాం. వారిలో 30 శాతం చేరుకున్నా చాలని భావించాం. శోభ కంపెనీ సామర్థ్యం వేరు. నేను దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించినప్పుడు చాలా దారుణమైన సమయం. తొలుత నేను 183 ఎకరాల భూమి కొనుగోలు చేశా. అయితే, ఆ సమయంలో అక్కడ భూమి కొనడం చాలా తప్పుడు నిర్ణయమనే కామెంట్లు వచ్చాయి. అయితే, నా దృష్టిలో దుబాయ్ వేరు. ఈ దేశాన్ని ఎవరూ టచ్ చేయలేరు. ఇక్కడ అన్నీ బాగుంటాయి. పరిపాలన, అధికార యంత్రాంగం అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే దుబాయ్ లో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే నేను వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి అవినీతి లేదు.. ఎలాంటి సమస్యలూ ఉండవు. ఎవరికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే దుబాయ్ వచ్చి వారి వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.

నా వరకు నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడటానికి అంగీకరించను. తప్పు జరుగుతుందంటే ఊరుకోను. నాతో పనిచేస్తున్నవారు అది కస్టమర్ ఒప్పుకున్నాడని చెబుతుంటారు. అయితే, కస్టమర్ కి తెలియదు కదా? మనమే వారికి అది తప్పు అని చెప్పాలి. దుబాయ్ లో మాకు స్టూడియో ఉంది. నిర్మాణ రంగానికి సంబంధించి అక్కడ నిత్యం 29 నుంచి 30 యాక్టివిటీస్ జరుగుతుంటాయి. 150 మంది ఆర్కిటెక్టులు పని చేస్తుంటారు. దాదాపు 14 వేల మంది మా దగ్గర పనిచేస్తున్నారు. 2024 నాటికి మా కంపెనీ దుబాయ్ లోనే అతిపెద్ద కాంట్రాక్ట్ కంపెనీ అవుతుంది. పైగా మేం ఇతర కాంట్రాక్టర్లు, కంపెనీల కోసం పని చేయం. వుడ్ వర్కింగ్ కూడా మేమే చేస్తాం. దీనికి సంబంధించి ఇండియాలో మాకు ఫ్యాక్టరీ కూడా ఉంది. అంటే.. నాది దగ్గర నుంచి ప్రాజెక్టు పూర్తి చేసేవరకు అన్నీ మాకు మేమే చేస్తాం. అంతేకాకుండా నిర్దేశిత సమయాని కంటే ముందుగానే డెలివరీ చేస్తాం. క్వాలిటీ విషయంలో ఎవరూ మాతో పోటీపడలేరు అని గట్టిగా చెప్పగలను. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేస్తున్నాం’ అని వివరించారు.

This website uses cookies.