గత నాలుగైదేళ్లుగా వృద్ధి చెందుతున్న నిర్మాణ రంగం.. రానున్న రోజుల్లోనూ మరింత అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడు వి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గాన్ని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూముల ధరలు పెరగడం వల్ల బిల్డర్లకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. అంతిమంగా కొనుగోలుదారుల మీదే భారం పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణం ఊపందుకుందని.. అందుకే కార్మికుల నైపుణ్యాల్ని పెంపొందించేందుకు అధిక దృష్టి సారిస్తామని తెలిపారు. నగరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో అవసరమైతే తమ సొంత నిధుల్ని వెచ్చించి.. అంతర్జాతీయ కన్సల్టెంట్లను సంప్రదించి.. మంచి ప్రతిపాదనల్ని రూపొందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవి పూర్తయ్యాక ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ రావు మాట్లాడుతూ.. డెవలపర్లు అంటే సమాజంలో చెడ్డ వ్యక్తులుగా కొందరు చిత్రీకరిస్తుంటారని.. అయితే, ఆ ఆలోచనా విధానంలో మార్పును తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అపార్టుమెంట్లను నిర్మించేందుకు బిల్డర్లు రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటారని.. అనేక ఆటుపోట్లను సమర్థంగా అధిగమిస్తారని వివరించారు. అపార్టుమెంట్లను కట్టడమంటే ఆషామాషీ విషయమేం కాదన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు తప్పుడు పనులు చేసినంత మాత్రాన ఈ రంగమంతా అలాగే ఉంటుందన్న భావన కరెక్టు కాదన్నారు. కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిర్మాణ పనుల్నివేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఫలితంగా, కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లను అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 నుంచి 2025 మధ్యకాలంలో క్రెడాయ్ హైదరాబాద్లో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ఈసారి అన్ని జోన్లకు చెందిన బిల్డర్లకు కొత్త కమిటీలో ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. ఒకవైపు నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని.. వాటిని ఎప్పటికప్పుడు సమర్థంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులతో కలిసి పని చేస్తామన్నారు. రెరా విభాగానికి ఛైర్మన్‌గా మెరుగైన అధికారి అయిన సత్యనారాయణను నియమించారని తెలిపారు. నిర్మాణ రంగం ఎదుర్కొనే ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించేందుకు వచ్చే రెండేళ్ల పాటు కృషి చేస్తామన్నారు.
ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన సీనియర్ డెవలపర్లతో పాటు యువ బిల్డర్లు క్రెడాయ్ హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తపల్లి రాంబాబు మాట్లాడుతూ.. గతేడాది కమర్షియల్ స్పేస్ నిర్మాణంలో మొదటిస్థానంలో నిలిచామన్నారు. తామంతా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కోశాధికారి మనోజ్ అగర్వాల్ మాట్లాడుతూ క్రెడాయ్ హైదరాబాద్ ఎలా ఆరంభమైందో తెలిపారు. ముప్పయ్ ఐదు మంది బిల్డర్ల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే.. వారితోనే ఈ సంఘం ఏర్పాటైందన్నారు. తాను సంఘం పౌండింగ్ మెంబర్‌నని చెప్పారు. ఈసారి అసోసియేషన్ కోసం పని చేసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. నిర్మాణ రంగంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిపి పని చేస్తామన్నారు.
జాయింట్ సెక్రటరీ క్రాంతికిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో క్రెడాయ్ హైదరాబాద్‌కి ఎన్నికలు జరగలేదని.. ఈసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన బృందం తమదన్నారు. అంతేతప్ప, ఇది నామినేటెడ్ బాడీ కాదన్నారు. దీని వల్ల కొత్త యువత అసోసియేషన్‌లోకి వచ్చిందని తెలిపారు. కొత్తగా వచ్చే ఏ ప్రభుత్వం అయినా, అదే అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అనేక పట్టణాలు, మండలాలు హైదరాబాద్ కి చేరువగా ఉన్నాయని.. అందుకే హైదరాబాద్ ఎంత వృద్ధి చెందితే.. మిగతా ప్రాంతాలు అదేవిధంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. జాయింట్ సెక్రటరీ నితీష్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్డర్లకు సాంకేతిక అంశాలపై మరింత అవగాహన పెంచేందుకు కృషి చేస్తామన్నారు. తద్వారా రియల్ వ్యాపారంపై మరింత అవగాహనను పెంపొదిస్తామని తెలిపారు.
క్రెడాయ్ హైదరాబాద్ సరికొత్త బృందమిదే..
అధ్యక్షుడు : రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షుడు (ఎలక్ట్) : జైదీప్ రెడ్డి ఉపాధ్యక్షులు: ప్రదీప్ రెడ్డి, ఎం శ్రీకాంత్, కొత్తపల్లి రాంబాబు, మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి: బి.జగన్నాథ్ రావు జాయింట్ సెక్రటరీ: క్రాంతికిరణ్‌రెడ్డి, నితీష్ రెడ్డి ట్రెజరర్: మనోజ్ అగర్వాల్
ఈసీ సభ్యులు:
సంజయ్ కుమార్ బన్సల్, ఎ.వెంకట్ రెడ్డి, మోరిశెట్టి శ్రీనివాస్, ఎన్.వంశీధర్‌రెడ్డి, అమరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సుశీల్ కుమార్ జైన్, ముసునూరు శ్రీరాం