క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించే ప్రాపర్టీ షోలను మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షో అని పిలుస్తారు. ఈసారి కొవిడ్ నియమాల్ని పాటిస్తూ ప్రపంచ స్థాయిలో ప్రాపర్టీ షోను ఆగస్టు 13 నుంచి 15 దాకా నిర్వహించేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డెవలపర్లు స్టాళ్లన్నీ ఇప్పటికే రిజర్వు చేసుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి.
దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మన రియల్ ఎస్టేట్ రంగం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. రియల్ ఎస్టేట్ అనుమతుల కోసం టీఎస్–బీపాస్ వంటివి ఆరంభం కావడంతో వృద్ధి వేగవంతం అయ్యింది. పశ్చిమ ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా నగర వ్యాప్తంగా వృద్ధి చెందింది. వాణిజ్య, రిటైల్, గృహ రియల్ ఎస్టేట్‌లో వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో టీఎస్‌ఐఐసీ 10 పారిశ్రామిక పార్కులతో 810 ఎకరాలను 453 పారిశ్రామిక ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా అభివృద్ధికి పునాది వేసింది.
టీఎస్–ఐపాస్ రూ. 2,14,951 కోట్లను ఆకర్షించడంతో పాటుగా 15.6 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఈవీలు (4 వేల కోట్ల రూపాయల పెట్టుబడి హామీతో )పై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీ కోసం జినోమ్ వ్యాలీ, కిటెక్స్ గార్మెంట్స్ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం వంటివి వీటిలో ఉన్నాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల వల్ల రియల్ రంగం మూడు పూవులు ఆరు కాయిలుగా అభివృద్ధి చెందుతోంది.
వ్యవసాయం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ రియల్ రంగం అభివృద్ధి చెందుతుంది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో నేటికీ ఫ్లాట్ల రేట్లు తక్కువే ఉన్నాయి. అందుకే, అమ్మకాలు మెరుగ్గానే జరుగుతున్నాయి. ఈ సంవత్సర తొలి త్రైమాసంలో అమ్మకాల పరంగా 39% వృద్ధిని నమోదు చేసింది. అమ్ముడుపోని ఇళ్ల పరంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో అతి తక్కువగా ఉంది. తొలి త్రైమాసంలో దేశంలో ప్రారంభమైన నూతన ప్రాజెక్టుల్లో 30% హైదరాబాద్లోనే జరిగాయి.
– రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్
ఫార్మా, ఐటీ వంటి రంగాల వల్ల వచ్చే ఐదు నుంచి పదేళ్ల దాకా హైదరాబాద్ రియాల్టీ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు. కరోనా మొదటి వేవ్లో ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రాయితీ నగర నిర్మాణ రంగానికి ఊతమిచ్చింది. అలాంటి ప్రతికూల సమయంలోనూ మన వద్ద అధిక శాతం మంది డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో, దేశవ్యాప్తంగా బిల్డర్ల ఫోకస్ హైదరాబాద్ మీద పడింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను కనీసం మరో మూడు నెలల దాకా పెంచకుండా ఉంటే ఉత్తమం.
– వి. రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, క్రెడాయ్ హైదరాబాద్
This website uses cookies.