క్రెడాయ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తామని డీఎస్ఎల్ ఇన్‌ఫ్రా డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఆయన ఇటీవల క్రెడాయ్ హైదరాబాద్‌కు జరిగిన ఎన్నికల్లో ట్రెజరర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎవర్ గ్రీన్‌గా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కొత్త బృందమంతా కలిసి క్రెడాయ్ హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. క్రెడాయ్ వద్ద ఇళ్లను కొంటే ఎలాంటి ఇబ్బందులుండవని.. లావాదేవీలన్నీ స్మూత్‌గా జరుగుతాయని బయ్యర్లు భావించేలా తమ సంఘాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం తమ సంఘంలో 305 డెవలపర్లు సభ్యులుగా ఉన్నారని.. వీరి సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…
హైదరాబాద్ విశిష్ఠత ఏమిటంటే.. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగ్గా డెవలప్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్లిప్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, సబ్ వేలు, మెట్రో రైలు వంటివి గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ్నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. కాస్మోపాలిటన్ కల్చర్ ఈ నగరానికి సొంతం. సుమారు లక్ష సీసీటీవీ కెమెరాలు డేగలా కాపలా కాస్తుండటం వల్ల పౌరుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే, ఇది సేఫెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. అన్నింటి కంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వచ్చే యాభై నుంచి డెబ్బయ్ ఐదేళ్ల వరకూ హైదరాబాద్‌లో నీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడి వాతావరణం ప్రతిఒక్కరికీ నచ్చుతుంది. ఇలాంటి అనేక అంశాల వల్ల.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు సైతం పదవీవిరమణ పొందిన తర్వాత నగరానికి విచ్చేసి స్థిర పడుతున్నారు. దేశంలోని అనేక నగరాల్నుంచి వచ్చేవారు సైతం.. హైదరాబాద్లోనే ఇల్లు కొనుక్కుంటున్నారు. అందుకే, మన వద్ద ఇళ్ల ధరలు పడిపోవనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
హైదరాబాద్ అంటే ఇప్పుడిదో స్థానిక నగరం కానే కాదు. ఇదో విదేశీ నగరాల సరసన చేరింది. పైగా, గత కొన్నేళ్లనుంచి క్షుణ్నంగా గమనిస్తే.. భాగ్యనగరం ప్రస్తుతం నాలుగు వైపులా అభివృద్ధి చెందుతోంది. నిన్నటివరకూ పశ్చిమ హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ, ఐటీఈఎస్, ఆర్థిక సంస్థలు ఏర్పాటయ్యాయి. అక్కడే అధిక సంఖ్యలో కంపెనీలు ఏర్పడటంతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రియల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికల్ని రచించింది.
ఈస్ట్ హైదరాబాద్‌ని అభివృద్ధి చేసేందుకు ఈస్ట్ లుక్ పాలసీకి రూపకల్పన చేసి ఐటీ సంస్థల్ని ప్రోత్సహించింది. అంతెందుకు పోచారంలో ఇన్ఫోసిస్ ఏర్పాటైంది. కండ్లకోయలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసింది. శామీర్ పేట్‌లో బయోటెక్ పరిశ్రమను డెవలప్ చేశారు. పటాన్‌చెరు మార్గంలో మెడికల్ డివైజెస్ పార్కుకు శ్రీకారం చుట్టింది. చందన్‌వేలిలో వెల్‌స్పన్ వంటి పరిశ్రమలు మొదలయ్యాయి. విజయవాడ హైవే మీద లాజిస్టిక్స్ పార్కును ఆరంభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే, నగరాన్ని నాలుగువైపులా డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలాంటి అనేక అంశాల్ని గమనించాకే, హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు చాలామంది బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం నాలుగు వైపులా భాగ్యనగరం విస్తరిస్తూ అభివృద్ధి చెందటం వల్లే.. అధిక శాతం మంది తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు.
This website uses cookies.