Categories: LATEST UPDATES

అమ్మకాల్లో లగ్జరీ ఇళ్ల దూకుడు

  • 97 శాతం పెరిగిన విక్రయాలు
  • సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. లగ్జరీ హౌసింగ్ విభాగంలో అమ్మకాలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. రూ. 4 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ లో వీటి అమ్మకాలు ఏకంగా 97 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 4,700 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడు కాగా, ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 9,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మేరకు వివరాలను ప్రముఖ రియ్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది.

ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ3, 2023 పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తొలి మూడు స్థానాల్లో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ మూడు నగరాల వాటా 90 శాతం ఉండటం గమనార్హం. 37 శాతంతో ఢిల్లీ మొదటి స్థానంల ఉండగా.. ముంబై 35 శాతం, హైదరాబాద్ 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. లగ్జరీ ఇళ్ల విక్రయాల్ల పుణె వాటా 4 శాతంగా నమోదైంది. ఇక జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 19 శాతం పెరిగినట్టు నివేదిక తెలిపింది. 2022లో ఇతే త్రైమాసికంలో దాదాపు 2వేల యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది క్యూ3లో దాదాపు 2,400 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఈ త్రైమాసికంలో జరిగిన అమ్మకాల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

పండగ సీజన్ లో మరిన్ని విక్రయాలు?

ఈ పండగ సీజన్ లో మరిన్ని యూనిట్ల అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో జరిగిన విక్రయాల నేపథ్యంలో పండగ సీజన్ లో రియర్ రంగానికి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. 2023 పండగ సీజన్లో ఇళ్ల విక్రయాలు 1,50,000 మార్కును దాటి మూడేళ్ల రికార్డు బద్దలుకొట్టే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇక మొత్తంగా అన్ని రకాల ఇళ్లను పరిశీలిస్తే.. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 2.30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 5 శాతం అధికం.

అదే సమయంలో కొత్తగా 2.20 లక్షల ఇళ్లను నిర్మించడానికి డెవలపర్లు సన్నద్ధమయ్యారు. ఈ తొమ్మిది నెలల్లో రెసిడెన్షియల్ అమ్మకాల్లో మిడ్ ఎండ్ ప్రాజెక్టులు ఆధిపత్యం చెలాయించాయి. మొత్తం అమ్మకాల్లో ఇవి దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి. తర్వాత హై ఎండ్, అందుబాట ధరల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఇళ్ల అమ్మకాల్లో ముంబై, పుణె, బెంగళూరు 62 శాతం వాటా కలిగి ఉన్నాయి. లాంచింగుల్లో ముంబై, పుణె, హైదరాబాద్ 64 శాతం వాటాతో ఉండటం విశేషం.

పండుగ సీజన్ నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్ మరింత జోరుగా దూసుకెళ్తుందని భావిస్తున్నట్టు సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. ‘పండగ సీజన్ లో డెవలపర్లు అందించే ప్రోత్సాహకాలు, పథకాలు అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. పండగ సీజన్లో ఆపర్లు, వడ్డీ రేటు తగ్గింపుల వంటి కారణాలతో కొనుగోలుదారులు ఇళ్లు కొనడానికి ముందుకు వస్తారు’ అని అభిప్రాయపడ్డారు.

This website uses cookies.