అన్ని ప్రాంతాల మాదిరిగానే మంచిర్యాలలో డీమార్ట్ ఆరంభమైంది. కాకపోతే, దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, ఒక్క రోజులోనే రూ.45 లక్షల మేరకు అమ్మకాలు జరిగింది. ఇది దేశంలోనే సరికొత్త రికార్డుగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే.. మంచిర్యాలకు తెలంగాణ జిల్లాలోనే ప్రత్యేకమైన స్థానం ఉందని క్రెడాయ్ మంచిర్యాల ఛైర్మన్ గుర్రం నర్సింహారెడ్డి వివరించారు. “రియల్ ఎస్టేట్ గురు“తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి గల రియల్ ఎస్టేట్ మార్కెట్ విశేషాల్ని ప్రత్యేకంగా వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
” మంచిర్యాల ప్రాంతం ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సింగరేణి, పవర్ ప్లాంట్ వంటివి ఏర్పాటయ్యాయి. నార్త్ మరియు సౌత్ ఇండియాను అనుసంధానం చేసే రైల్వే లైను ఉండటం, సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావడం వంటివి మంచిర్యాలకు కలిసొచ్చే అంశాలు. పైగా చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దులకు చెందిన ప్రాంతాల్లో నివసించేవారంతా మెడికల్ ఎమర్జన్సీ లేదా షాపింగ్ నిమిత్తం మంచిర్యాలకు విచ్చేస్తుంటారు. ఫెర్టిలైజర్స్, సీడ్స్, నిత్యావసర వస్తువుల్ని ఇక్కడ్నుంచే తీసుకువెళతారు.
సింగరేణీలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులుంటే, అందులో ముప్పయ్ నుంచి నలభై శాతం మంది మంచిర్యాలోనే ఉండటానికి ఇష్టపడుతుంటారు. గోదావరి ఉండటంతో మంచి నీరుకు ఎలాంటి సమస్య లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇలాంటి అనేక అంశాల కారణంగా మంచిర్యాల ఒక పెద్ద బిజినెస్ సెంటర్గా అవతరించింది. షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కార్పొరేట్ గోల్డ్ షాపులు వంటి వాటికి కొదవే లేదు. డీమార్ట్, రిలయన్స్, హెరిటేజ్, మోర్, విశాల్ సూపర్ మార్కెట్లు, మ్యాక్స్ ఫ్యాషన్ వంటివి ఏర్పాటయ్యాయి. ఇలాంటి అనేక అంశాల కారణంగా మంచిర్యాలలో రియల్ రంగానికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
మంచిర్యాల పరిధిలో కొత్తగా ఏర్పడిన నస్‌పూర్ మున్సిపాలిటీలో కొత్తగా లేఅవుట్లు, అపార్టుమెంట్ల నిర్మాణం జరుగుతోంది. మరో మున్సిపాలిటీ అయిన క్యాథన్‌పల్లిలో ఎక్కువగా అపార్టుమెంట్లను కడుతున్నారు. ఇక, లక్షెట్టీపేట్ రోడ్డులో కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి పలువురు రియల్టర్లు ప్రణాళికల్ని రచిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ రోడ్డులోనే ఎక్కువ లేఅవుట్లు ఏర్పడే అవకాశముంది. అక్కడక్కడా పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను అమ్ముతున్నప్పటికీ, కొత్తగా అభివృద్ధి చెందుతున్న డీటీసీపీ లేఅవుట్లలో ప్లాటు కొనాలంటే గజానికి కనీసం రూ.15 వేల దాకా పెట్టాల్సిందే. ఫ్లాట్ల ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.3000 నుంచి రూ.3,500 దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇక వ్యక్తిగత గృహాల్ని కొనేవారు ఇటీవల కాలంలో పెరిగారు. నాణ్యమైన వ్యక్తిగత గృహాలు కావాలని కోరుకునేవారు రూ.40 లక్షలకు పైగా పెట్టాల్సి ఉంటుంది. వాణజ్య ప్లాట్ల విషయానికొస్తే.. బిజినెస్ సెంటర్‌లో గజం ధర దాదాపు రూ.1.5 లక్ష దాకా ఉంటుంది. బస్టాపు రోడ్డు, మెయిన్ రోడ్డులో గజం ధర రూ.లక్షకు పైగానే రేటు పలుకుతోంది.
నాణ్యమైన నిర్మాణాల్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో సివిల్ ఇంజినీర్ పూర్తయిన కొన్నాళ్ల తర్వాత 2008లో సొంతంగా వెంకటసాయి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీని స్టార్ట్ చేశాను. ఇప్పటివరకూ ఎనిమిది అపార్టుమెంట్లు, నలభై డ్యూప్లో విల్లాల ప్రాజెక్టు, అక్కడక్కడా వ్యక్తిగత గృహాల నిర్మాణాల్ని పూర్తి చేశాను. మంచిర్యాలలో క్రెడాయ్ సంఘంలో సుమారు వందకు పైగా బిల్డర్లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటిస్తూ నాణ్యమైన నిర్మాణాల్ని చేపడుతున్నారు. కరోనా సమయంలో ప్రారంభంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినప్పటికీ, మళ్లీ గాడిలో పడింది. ఊహించిన దానికంటే అధిక స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి.”
This website uses cookies.