Categories: TOP STORIES

హైడ్రాను మించిన సమస్యలు చూశాం

ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు

అనుమతుల్లేని భవనాలనే హైడ్రా కూలగొడుతోంది

గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తున్నారు

హైదరాబాద్ లోని కొన్ని వేల ప్రాజెక్టుల్లో

ఎఫ్ టీఎల్ లో ఉండేవి చాలా తక్కువ

రియల్ ఎస్టేట్ గురుతో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ గుమ్మిరామిరెడ్డి

హైదరాబాద్ లో హైడ్రా కూల్చేతలు తదితర పరిణామాల ప్రభావం రియల్ ఎస్టేట్ పై ఉండదని క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ గుమ్మి రామిరెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుత స్తబ్దత తాత్కాలికమేనని, ఐదారు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు. మన రియల్ ఎస్టేట్ రంగం హైడ్రాను మించిన సమస్యలను ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రియల్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాట్లల్లోనే..

అసలు హైడ్రా ఏం చేస్తుందో ఆలోచిద్దాం. వాళ్లు చెరువుల్లో ఎఫ్ టీఎల్ లో ఉన్న భవనాలను మాత్రమే కూలగొట్టారు. ఎన్ని భవనాలను అనుమతి ఉన్నవి కూలగొట్టారు చెప్పండి. ఒకచోట విల్లా ప్రాజెక్టు కూలగొట్టారు. అది కూడా గ్రామపంచాయతీ అనుమతి తీసుకున్న ప్రాజెక్టు. తర్వాత దానికి అనుమతులు రద్దు చేశారు. ఈ విలేజ్ సెక్రటరీని కూడా సస్పెండ్ చేశారు. పర్మిషన్ తీసుకున్న ఒక్క భవనాన్ని కూడా హైడ్రా కూలగొట్టలేదు. ఇప్పుడేమో అనుమతులు తీసుకోవడంలోనే లోపాలున్నాయని.. మేనేజ్ చేసి పర్మిషన్లు తీసుకున్నారని అంటున్నారు. జరిగింది గోరంత అయితే, చూపించేది కొండంత అన్నట్టు చేస్తున్నారు. హైడ్రా చర్యల వల్ల కొంతమంది పేదలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అయితే, దానికి కూడా క్లారిటీ ఇచ్చారు.

తాము పేదల జోలికి వెళ్లడంలేదని స్పష్టంచేశారు. పేదల పేరు చెప్పుకుని కొంతమంది ఇలా చేస్తున్నారని కూడా ఒకటి క్రియేట్ అయింది. మూసీ రివర్ ఫ్రంట్ ఉంది. దానిని సుందరీకరణ చేద్దామని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా బూచి చెప్పి రియల్ ఎస్టేట్ రంగం అయిపోయిందని చెబుతున్నారు. అలా ఎందుకు అయిపోతుంది? చెరువుల వద్ద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? హైదరాబాద్ లో కొన్ని వేల ప్రాజెక్టులు ఉన్నాయి? మరి చెరువులు లేదా ఎఫ్ టీఎల్ లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? అలాంటప్పుడు ఎందుకు దీని ప్రభావం రియల్ రంగంపై పడుతుంది? మన దగ్గర నెగిటివ్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కొనుగోలుదారులు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. కనుచూపు మేర ఎక్కడా చెరువు లేనప్పుడు అక్కడ ఎందుకు కొనుగోళ్లు ఆగాలి?

కొనేముందు చెక్ చేసుకోవాలి..

ఎవరైనా సరే ప్రాపర్టీ కొనే ముందు అన్నీ చెక్ చేసుకోవాలి. కొంతమంది గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీ సేల్స్ లో ఇలాంటివి జరుగుతున్నాయి. లొకేషన్, తక్కువ ధర చూసి పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇలా ఎంతో మంది మోసపోయారు. రూ.కోటి ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఓ రూ.10వేలు అడ్వొకేట్ కి ఇచ్చి అన్ని పత్రాలూ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా? మన దగ్గర ఇలాంటి నేరాలు చేసేవారికి సరైన శిక్షలు లేవు. అందువల్లే ఇక్కడ అలాంటివి జరుగుతున్నాయి. దుబాయ్ వంటి దేశాల్లో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగవు చెప్పండి? అక్కడ అంతా సక్రమంగా జరుగుతాయి. భూ యజమాని దగ్గర నుంచి మొదలుపెడితే ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజనీర్, కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా జవాబుదారీగా ఉంటారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. అది లేనంత వరకు మనకు ఇలాంటి సమస్యలు తప్పవు.

హైడ్రాతో ఏమీ అయిపోదు..

హైడ్రా పేరు చూసి ఏదో జరిగిపోతుందనే భయం నెలకొంది. నిజానికి ఏమీ అవదు. కొనుగోలుదారులు ఇప్పుడు ఏదైనా కొనాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. గతంలో నేరుగా వెళ్లి కొనేసేవారు. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం స్తబ్దత ఉంటుంది. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? ఇదేమీ శాశ్వతం కాదు. హైడ్రా మొత్తం మూసీని ప్రక్షాళన చేస్తుంది. చెరువులు, ఇతరత్రా కూడా ప్రక్షాళన చేస్తుంది. తర్వాత ఇంకేం ఉంటుంది? అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మహా అయితే ఆరు నెలలు.. తర్వాత అంతా మళ్లీ యథావిధిగా జరుగుతాయి. జనాలు పెరుగుతుంటారు. డిమాండ్ పెరుగుతుంది. మనం రియల్ ఎస్టేట్ లో ఎన్నో ఒడుదొడుకులు చూశాం. అందువల్ల దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరిలో ఏదో భయం క్రియేట్ అయిపోయింది. మీడియాలో కూడా చిన్న విషయాన్ని పెద్దగా చూపిస్తున్నారు. లేనిది కూడా చూపిస్తున్నారు. కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రకరకాల వదంతులు వ్యాపింపజేస్తున్నారు. డెవలపర్లు కానీ, కొనుగోలుదారులు కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారులు ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నెలరోజుల పాటు అన్నీ పరిశీలించుకుని కొనండి. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

రుణగ్రహీతలు నష్టపోతారు..

ఇప్పుడు హైడ్రా కూల్చేసిన విల్లాలకు సంబంధించి ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకున్నవారు కచ్చితంగా ఇబ్బంది పడతారు. బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు తప్పకుండా తమ ప్రయోజనాలకు విఘాతం కలగడకుండా బోలెడు పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటాయి. అందువల్ల అక్కడ విల్లా లేకున్నా.. రుణం తీసుకున్నవారు దానిని చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి బ్యాంకు లోన్ వచ్చిందంటే ఆ ప్రాపర్టీ సక్రమమే అనే భావన ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాంకు రుణం తీసుకున్న ప్రాపర్టీలను కూడా కూల్చేశారంటే బ్యాంకు సరిగా చెక్ చేయలేదనే కదా అర్థం. బ్యాంకులకు ఆ మొత్తం చిన్నదేనైనా.. కొనుగోలుదారులకు మాత్రం ఆర్థికంగా అది పెనుభారమే కదా?

అధికారులు జాగ్రత్తగా చూడాలి..

రెవెన్యూ, ఇరిగేషన్ ప్లాన్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు అన్నీ సరిగా పరిశీలించకుండా హైడ్రా రంగంలోకి దిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏవైనా సంస్కరణలు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అందువల్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అమాయకులు, తప్పుచేయని వాళ్లు నష్టపోకూడదు. తొందరపడి అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదు. అందువల్ల అన్ని వివరాలూ సక్రమంగా పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలి. వాస్తవానికి హైడ్రా ఇక్కడ తన బాధ్యత మాత్రమే నెరవేరుస్తోంది. ఇక్కడ వాళ్లకు రిపోర్టు ఇచ్చేది రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులే కదా? ఇది ఎఫ్ టీఎల్ లో ఉంది అని వారు రిపోర్టు ఇస్తే.. హైడ్రా వాటిని కూల్చేస్తోంది. అందువల్ల ఈ రిపోర్టు ఇచ్చే అధికారులు చాలా జాగ్రత్తగా అన్నీ పరిశీలించి.. అది కచ్చితంగా ఎఫ్ టీఎల్ లో ఉందని నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్టు ఇవ్వాలి.

అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నందుకు..

హైదరాబాద్ అభివృద్ధి కనిపిస్తోందంటే దానికి కారణం అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఈ విధానం లేకుంటే హైదరాబాద్ లో ఇన్ని ఆకాశహర్మ్మాలు ఉండేవి కావు. ఏ సిటీకి వెళ్లినా మనకు తొలుత కనిపించేది భవనాలే కదా? సింగపూర్, మలేసియా ఇలా ఎక్కడకు వెళ్లినా భవనాలే కనిపిస్తాయి. అందువల్ల ఆ భవనాలను ఎంకరేజ్ చేస్తూనే, వాటికి మౌలిక వసతులు కల్పించడం చాలా అవసరం. వంద ఫీట్లు, అంతకంటే ఎక్కువ ఫీట్ల రోడ్లు ఉంటే ఎన్ని స్కై స్క్రేపర్లు వచ్చినా సమస్య ఉండదు. సెట్ బ్యాక్స్ తగ్గించడం కూడా ఆకాశహర్మ్యాలు పెరగడానికి మరో కారణం. నిజానికి స్కై స్క్రేపర్ల వల్ల నగరానికి అందం వస్తుంది. అంతేకాకుండా భూములు ధరలు కూడా పెరిగాయి. ల్యాండ్ లార్డ్ నా వాటాకు లక్ష చదరపు అడుగులు కావాలంటున్నాడు. ఆయనకు లక్ష చదరపు అడుగులు ఇవ్వాలంటే బిల్డర్ కనీసం 5 లక్షల చదరపు అడుగులు కట్టాలి. అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండటం వల్లే పైకి కట్టుకుంటూ వెళుతున్నారు.

కొన్ని సందేహాలు సహజం..

పదేళ్లు ఓ ప్రభుత్వం పరిపాలించి వెళ్లిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే జనాల్లో కొన్ని సందేహాలు ఉండటం సహజం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాది కూడా అలాగే ఉంది. అదే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా కొంత సమయం అవసరం. రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తానని ఇప్పటికే సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు. అందుకు తగినట్టుగానే ట్రిపుల్ ఆర్ వేగవంతం చేశారు. ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటివి ప్రకటించారు. మూసీ ప్రక్షాళన.. ఇలా చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ నిజమైతే సూపర్ సక్సెస్ అవుతుంది.

రియల్ పెట్టుబడి లాభదాయకమే..

రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ మెంట్ అనేది ఎప్పుడైనా మంచిదే. ఎప్పటికైనా దాని విలువ పెరుగుతుంది. జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు కాబట్టి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ప్రాపర్టీ కొనుగోళ్ల విషయంలో ఎవరూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు.

This website uses cookies.