Categories: TOP STORIES

హైడ్రా ఎఫెక్ట్.. రిజిస్ట్రేషన్లు డౌన్

కూల్చివేతల ప్రభావంతో తగ్గిన కొనుగోళ్లు

సెప్టెంబర్ లో 30 శాతం తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

ఆందోళనతో కొనుగోళ్లు వాయిదా వేస్తుండటమే ఇందుకు కారణం

హైడ్రా కూల్చివేతల ప్రభావం ప్రాపర్టీ కొనుగోళ్లపై పడింది. చెరువుల, నీటివనరుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. జిల్లాల్లోనూ హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. మేడ్చల్‌, పటాన్‌చెరు రిజిస్ట్రేషన్‌ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గాయి. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. రూ.7,229.88 కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. గతేడాది ప్రాపర్టీ రేట్లతో పెరిగిన రేట్లు పోలిస్తే ఆదాయంలో వ్యత్యాసం భారీగా ఉంటుంది. హైడ్రా హడావిడి కొనుగోలుదారుల్లో తెలియన అయోమయం, భయానికి కారణమైందని, అందువల్లే కొనుగోళ్లు తగ్గాయని రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

This website uses cookies.