(కింగ్ జాన్సన్ కొయ్యడ )
భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణ రంగంపై ఆధారపడింది. ఎందుకంటే, స్టీలు, సిమెంట్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, కాపర్, అల్యూమినియం, ప్లైవుడ్ వంటి దాదాపు 250కి పైగా పరిశ్రమలు నిర్మాణ రంగంతో ముడిపడింది. వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించేది నిర్మాణ రంగమేనని గుర్తుంచుకోవాలి. మనదేశంలో ఎంతలేదన్నా సుమారు ఐదు కోట్లకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని ఈ రంగం ద్వారా పొందుతున్నారు. జీడీపీలో నిర్మాణ రంగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాటా కలిపి ఎంతలేదన్నా 13 శాతం దాకా ఉంటుంది. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల ఎకానమికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాను.
నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల విషయానికి వస్తే.. అంతర్జాతీయంగా నెలకొన్న రిసెషన్ కు సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. కాకపోతే, దాన్ని ప్రభావం భారత రియల్ రంగంపై ఉండదు. నిజానికి చెప్పాలంటే, భారత ఆర్థిక వ్యవస్థ మిగతా అభివృద్ధి దేశాలతో పోల్చితే పటిష్ఠంగా ఉంది. విదేశాల్లో పని చేసేవారు ఉద్యోగాలు కోల్పోవడం ఎక్కువగా నమోదు కాలేదు. ఎందుకంటే, భారతీయులది కష్టపడి పని చేసే మనస్తత్వం కాబట్టి అంత సులువుగా ఉద్యోగాలు కోల్పోరు.
నిర్మాణ రంగంలో ఫ్లాట్ల సంఖ్య పెరుగుతోంది. కొనుగోలుదారులు అధికమవుతున్నారు. కొత్త కట్టడాల్ని చేపడుతున్నా సుశిక్షితులైన నిర్మాణ కార్మికుల కొరత విపరీతంగా ఉంది. ఈ విభాగంలో భవన నిర్మాణ కార్మికులకు సరైన శిక్షణను అందించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాం. కన్స్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యకలాపాల్ని పెంచేందుకు ప్రయత్నిస్తాను.
మన దేశంలో నిర్మాణ రంగం వైవిధ్యమైంది. ప్రతి ప్రాంతానికో ప్రాధాన్యత ఉంటుంది. ముంబైలో ఫ్లాట్లను అధిక సంఖ్యలో నిర్మిస్తారు. ప్రస్తుతం అక్కడ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. స్థలం కొరత ఎక్కువగా ఉండటం.. ఫ్లాట్ ధర ఖరీదు కావడంతో.. అధికశాతం మందికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో.. అక్కడ కొందరు బిల్డర్లు చిన్న ఫ్లాట్లనూ ఎక్కువగా నిర్మిస్తున్నారు. పుణెలో సైతం అందుబాటు గృహాల సంఖ్య ఎక్కువేనని చెప్పొచ్చు. కోల్‌కతాలో రియాల్టీ వ్యాపారం మెరుగ్గా ఉంది. ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఈమధ్య కాలంలో మంచి పనితీరును కనబరుస్తోంది. దక్షిణాది విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో అమ్మకాలు ఎవర్‌గ్రీన్ అని చెప్పొచ్చు. బెంగళూరు, చెన్నైలో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొచ్చిన్, వైజాగ్ వంటి నగరాల్లో మార్కెట్ మెరుగ్గా ఉంది. సెంట్రల్ ఇండియాలో అహ్మదాబాద్ ముందంజలో ఉంది. మొత్తానికి, ప్రతి ప్రాంతంలో స్థానిక అవసరాల్ని బట్టి రియల్ రంగం వృద్ధి చెందుతోంది.
ఇళ్ల కొనుగోలుదారులకు నమ్మకాన్ని కలిగించే అతి కీలకమైన బ్రాండ్.. క్రెడాయ్. కాబట్టి, దీన్ని ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేయడం వల్ల దక్షిణ భారతదేశంతో పాటు ఇతర రాష్ట్రాల డెవలపర్లతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడి మార్కెట్ స్థితిగతులపై అవగాహన పెరిగింది. ప్రస్తుతం క్రెడాయ్ జాతీయ కార్యదర్శిగా.. దూరదృష్టి గల మా అధ్యక్షుడి విజన్ నెరవేర్చేందుకు పని చేస్తాం. క్రెడాయ్ లోని దాదాపు 22 కమిటీలతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. క్రెడాయ్ జాతీయ సెక్రటేరియట్‌తో నిత్యం అందుబాటులో ఉంటూ సహాయ సహకారాల్ని అందించాలి. క్రెడాయ్ నేషనల్ అన్ని సమావేశాలు, ఈవెంట్లను నిర్వహించేందుకు తోడ్పాటును అందించాల్సి ఉంటుంది.
ఇష్టపడి చేసే ఏ పని వల్ల ఒత్తిడి అనేది ఉండదు. కాకపోతే, కాస్త ప్రణాళికాబద్ధంగా పనుల్ని చేపట్టాల్సి ఉంటుంది. శారీరికంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చని భావిస్తాను. అందుకే, పని అనేది ఒత్తిడిలా భావించను. ఎంత కష్టమైనా ఇష్టంగా పని చేస్తాను. మా సంస్థ ఆర్క్ గ్రూపును దేశంలోనే అత్యుత్తమ నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. మా ఆర్క్ ఫౌండేషన్ ద్వారా అనేక నిరుపేద పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందిస్తున్నాం. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాం.
This website uses cookies.