బిల్డర్ల కన్నీటి వ్యథ.. సర్వేలో విస్తుగొలిపే విషయాలు

  • క్రెడాయ్ నేషనల్ తాజా సర్వేలో విస్తుగొలిపే విషయాలు
  • దేశవ్యాప్తంగా కునారిల్లుతున్న నిర్మాణ రంగం
  • హైదరాబాద్లోనూ ఆలస్యమవుతున్న అనుమతులు
  • అంగీకరించిన 81 శాతం మంది డెవలపర్లు
  • కేంద్రం ఆపన్నహస్తం అందిస్తేనే పురోగతి
భారతదేశంలో ఏ డెవలపర్ ని అడిగినా కన్నీటి కథలే.. బాధాతప్త వ్యథలే.. కొందరు బాధలన్నీ దిగమింగుకుంటే.. మరికొందరు వెళ్లగక్కుతున్న ఆక్రోశం.. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ ఆక్రందన.. ఈ మహమ్మారి నుంచి బయటపడటమెలా అంటూ ఆవేదన చెందుతున్నారు. మరి, కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నిర్మాణ రంగం మళ్లీ గాడిలో పడుతుంది?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. భారతదేశంలోని నిర్మాణ సంస్థలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఏయే నగరాల డెవలపర్లు ఏయే ఇబ్బందులు పడుతున్నారు.. పశ్చిమ బిల్డర్ల సమస్యలేమిటి? దక్షిణాది డెవలపర్ల ఇబ్బందులేమిటి? ఇలా దేశవ్యాప్తంగా గల రియల్ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకునేందుకు క్రెడాయ్ నేషనల్ జాతీయ స్థాయిలో ఒక సర్వే చేసింది. ప్రత్యేకంగా తెలంగాణ నిర్మాణ రంగానికి సంబంధించి పదకొండు అంశాల్ని తెలుసుకుంది. 2021 మే 21 నుంచి జూన్ 3 దాకా నిర్వహించిన ఈ సర్వే సారాంశాలేమిటంటే..

కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. కార్మికుల కొరత కారణంగా నిర్మాణ పనులు నత్తనడక జరిగాయి. హైదరాబాద్లో దాదాపు 83 శాతం నిర్మాణ సంస్థలు కార్మికుల కొరత సమస్యను ఎదుర్కొన్నాయి. పాతిక శాతంలోపు కార్మికులతో 15 శాతం సంస్థలు సైట్లలో పని చేస్తే.. 25 నుంచి 50 శాతం సైట్లలో 51 శాతం కార్మికులు పని చేశారు. 50 నుంచి 75 శాతం సైట్లలో 29 శాతం కార్మికులు పని చేయగా.. కేవలం ఐదు శాతం సైట్లలో మాత్రమే వంద శాతం కార్మికులు పని చేయడం గమనార్హం.

21 రోజుల్లో అనుమతి ఏమైంది?

కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దాదాపు 93 శాతం ప్రాజెక్టులు ఆలస్యమయ్యే ప్రమాదముందని క్రెడాయ్ నేషనల్ సర్వేలో తేలింది. నిర్మాణ సామగ్రి, కార్మికుల ఖర్చు పెరగడం వల్ల నిర్మాణ వ్యయం ఐదు నుంచి పది శాతం పెరిగిందని 14 శాతం మంది డెవలపర్లు చెప్పగా.. పది నుంచి 20 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని మిగతా బిల్డర్లు చెప్పారు. ఇక ఇళ్ల అనుమతులైతే మరీ దారుణంగా తయారైంది. 21 రోజుల్లోనే అనుమతినిచ్చే ప్రక్రియను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరంభించినా.. ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నేటికీ, కేవలం 19 శాతం మాత్రమే అనుమతులు త్వరగా లభిస్తున్నాయని.. మిగతా 81 శాతం మంది డెవలపర్లకు సకాలంలో అనుమతులే రావడం లేదని డెవలపర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. హైదరాబాద్లో దాదాపు 54 శాతం మంది డెవలపర్లకు ప్రస్తుత రుణాల వల్ల ఇబ్బందులు పడుతుండగా.. ముప్పయ్ శాతం బిల్డర్లకు ఎలాంటి రుణాలు లేకపోవడం మంచి పరిణామం.

సొమ్ము విడుదల?

ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా సకాలంలో తమ నెలసరి వాయిదాల్ని చెల్లించడం లేదు. ఇలా దాదాపు 91 శాతం మంది సొమ్మును బిల్డర్లకు చెల్లించడం లేదు. కొనుగోలుదారులు ప్రాజెక్టుల్ని సందర్శించడం గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. కొనుగోలుదారులు ఇళ్లను కొనాలనే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు 97 శాతం మంది రియల్టర్లు అంగీకరిస్తున్నారు. మంజూరైన ఫ్లాట్లు, విల్లాలకు ఇంటి రుణాలు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని డెబ్బయ్ శాతం మంది బిల్డర్లు చెబుతున్నారు. మొత్తానికి, మొదటి దశ కంటే కరోనా రెండో దశ నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీసిందని 80 శాతం మంది డెవలపర్లు అంగీకరిస్తున్నారు.

మెరుగవ్వాలంటే ఇవి తప్పనిసరి

71 శాతం డెవలపర్లు స్టాంప్ డ్యూటీని తగ్గించాలని కోరుతున్నారు. దీంతో, ఇళ్లకు గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ మీద ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అందజేస్తే ప్రాజెక్టుల్ని సకాలంలో పూర్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. రుణాల్ని పునర్ వ్యవస్థీకరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెరిగిన భవన నిర్మాణ సామగ్రి ధరల్ని తగ్గిస్తే పరిస్థితి కొంత కుదుటపడుతుంది.

కేంద్రం నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలి

– హర్షవర్దన్ పటోడియా, అధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్.
Harsh Vardhan Patodia is CREDAI’s national president

రెండో వేవ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నిర్మాణ రంగాన్ని కేంద్రమే ఆదుకోవాలి. ఈ రంగం అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్లేందుకు పటిష్ఠమైన నిర్ణయాల్ని తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులకు వేగంగా టీకాల్ని అందజేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మరణాలు సంభవించే ప్రమాదం తప్పుతుంది. అప్పుడే భవన నిర్మాణ కార్మికులు మళ్లీ సైటులో పని చేయడానికి విచ్చేస్తారు. మొదటి వేవ్ యొక్క అనుభవంతో చూస్తే, రియల్ రంగం సాధారణ పరిస్థితికి వచ్చేందుకు ఎంతలేదన్నా ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది. ఇప్పటికే ఉన్న అన్ని రుణాలపై మారటోరియం విధించాలి. రుణగ్రహీతలపై ఐబిసి ​​చర్యల్ని నిలిపివేయాలి. రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్ధరించడానికి బహుముఖ విధానం అవసరం, ముఖ్యంగా జీఎస్టీలో సవరణలు చేయాలి. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో 12 శాతం జీఎస్టీ (అందుబాటు గృహాలకు 8%) లేదా ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ (అందుబాటు గృహాలకు 1%) ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలి. సిమెంటు ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. దీనిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకురావాలి.

This website uses cookies.