Categories: LEGAL

లీగల్ కాలమ్ : ఫ్లాటు కబ్జా చేస్తే పరిష్కారమెలా?

మా నాన్న పని చేసే సంస్థకు చెందిన హౌసింగ్ సొసైటీలో ఫ్లాటు వచ్చింది. ఇల్లు కట్టుకున్నాం. నాన్న మరణించిన తర్వాత నా వాటా వచ్చింది. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల నుంచి ఎన్వోసీ తీసుకుని నా పేరు మీద ఇంటిని రిజిస్టర్ చేశాం. ఆ ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే.. ఆ పత్రం సరిపోదని, రీ లింక్విష్మెంట్ డీడ్ అవసరమని అంటున్నారు. అది రిజిస్టర్డ్ అయ్యి ఉండాలని చెబుతున్నారు. అయితే, వీరు అడుగుతున్న పత్రం తప్పనిసరిగా కావాలా?

రమేష్, రాగన్నగూడ

ఎవరైనా మరణిస్తే, ఆస్తి విల్లు ద్వారా లబ్దిదారులకు సంక్రమించాలి. విల్లు లేకపోయినా లేక చెల్లకపోయినా చట్టప్రకారం వారసులకైనా సంక్రమించాల్సి ఉంటుంది. ఈ రెండు తప్ప మరో పద్ధతి లేదు. నామినేషన్ వల్ల ఆస్తి సంక్రమించదని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిరభ్యంతర పత్రాలు, ప్రమాణ పత్రాల ద్వారా ఆస్తి బదిలీ అనేది జరగదు. రాసిచ్చిన వారి హక్కులపై అవి ఎంతమేరకు ప్రభావితం చూపిస్తాయమనేది ముఖ్యం. అట్టి పత్రాల సాక్ష్యపు విలువ ఎంత? వారి హక్కుల విడుదల జరిగిందా? అనేవి దావాలో కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి, వాటిపై ఆధారపడి ఆస్తుల్నికొనడం కరెక్టు కాదు. వారు హక్కు విడుదల దస్తావేజు (రీ లింక్విష్మెంట్ డీడ్) అడగటం సబబే.

నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు విడిపోయారు. కానీ విడాకులు తీసుకోలేదు. మా అమ్మ ఇటీవల మరణించారు. నాన్న గారికి వారసత్వ ఆస్తి ఉంది. కానీ, వాటాలు పంచుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో, నేను ఆ ఆస్తిలో భాగం కోరేందుకు ఏం చేయాలి?

మహాలక్ష్మీ, ఈమెయిల్

తండ్రి ఉమ్మడి ఆస్తిలో రావాల్సిన భాగంలో పిల్లలకు జన్మ:త వాటా వస్తుంది. దాన్ని విడగొట్టి పంచాల్సిందిగా కోరే హక్కు వాటాదారులందరికీ ఉంటుంది. కాబట్టి, వెంటనే సివిల్ న్యాయవాదిని సంప్రదించి చర్యలు చేపట్టండి.

మేం ముగ్గుం అన్నదమ్ములం. రెండో అన్నయ్యను మా పెద్దనాన్న దత్తత తీసుకున్నాడు. ఇప్పుడేమో అన్న మా వద్దకొచ్చి నాన్న ఆస్తిలో భాగం ఇవ్వమని, పొలంలో వాటా ఇవ్వమని దబాయిస్తున్నాడు. తనకు హక్కు ఉంటుందా?

లక్ష్మీనారాయణ, లబ్బీపేట

దత్తత తేదీ నాటికి సంక్రమించి హక్కులు దత్తత వల్ల రద్దు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని బట్ట దత్తత నాటికి జన్మించిన కుటుంబం ఉమ్మడి ఆస్తిలో ఉన్న వాటా, చట్టరీత్యా ఉన్నా అన్ని బాధ్యతలకు లోబడి, దత్తతకు వెళ్లిన కొడుక్కీ కొనసాగుతుంది. చట్టం ఈ విషయంలో స్పష్టంగా ఉన్నా హైకోర్టుల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి, రాజీ మార్గం ఎంచుకోవడమే ఉత్తమం అని గుర్తుంచుకోండి.

నేను 2009లో ప్లాటు కొన్నాను. ఈమధ్య చూడటానికి వెళితే మరో వ్యక్తి ప్లాటు చుట్టూ గోడ కట్టాడు. అడిగితేనేమో 2012లో తన పేరు మీద రిజిస్టర్ అయ్యిందని అంటున్నాడు. నా దగ్గర ప్లాటుకు సంబంధించిన అన్నిపత్రాలున్నాయి. నాకు ప్లాటు అమ్మిన వ్యక్తిని అడిగితేనేమో ఎంతోకొంత తీసుకుని వదిలేయమని చెబుతున్నారు. కేసు పెడితే న్యాయం జరుగుతుందా?

కరీముల్లా, కరీంనగర్

మీరు ముందుగా కొని రిజిస్టర్ చేయించుకున్నారు. కాబట్టి, తర్వాత అమ్మితే అది చెల్లదు. అక్రమించుకున్నా, గోడ కట్టినా, మీకు అమ్మిన వ్యక్తితో రాయించుకున్నా వారికి హక్కులనేవి ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఆలస్యం చేయకూడదు. లేకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. తక్షణమే మంచి అనుభవం గల న్యాయవాదిని సంప్రదించండి.

మీకు ఎలాంటి లీగల్ సమస్యలున్నా.. మాకు రాయండి. అనుభవం గల న్యాయవాది మీకు సమాధానాలిస్తారు. మీరు ప్రశ్నలు మా మెయిల్ ఐడీకి పంపండి. regnews21@gmail.com

This website uses cookies.