Categories: EXCLUSIVE INTERVIEWS

నార్త్ హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైంది

  • ఇక్కడ కనెక్టివిటీ పెంచాలి
  • క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ చెరుకు రామచంద్రారెడ్డి

వెస్ట్ హైదరాబాద్ తో పోలిస్తే నార్త్ హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి కోరారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. 2007, 2008 సమయంలో పశ్చిమ హైదరాబాద్ తో పోలిస్తే.. కొంపల్లి, సుచిత్ర ఏరియా బాగా వెనకబడి ఉండేదన్నారు.

పది పదకొండేళ్లుగా బాగా ఇబ్బంది పడిందని, కానీ గత రెండు మూడేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చి ఇక్కడ కూడా మూమెంట్ పెరిగిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెరిగాయని.. కానీ వెస్ట్ సైడ్ రేట్లతో పోలిస్తే ఇప్పటికీ ఇక్కడ తక్కువేనని వివరించారు. కనెక్టివిటీ పరంగా నార్త్ హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురి కావడమే ఇందుకు కారణమన్నారు. ఈస్ట్, వెస్ట్ సైడ్ అంతా చక్కని కనెక్టివిటీ ఉందని.. ఇక్కడ మాత్రం ఫ్లైఓవర్లు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కొంపల్లి, సుచిత్ర వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని, మెట్రోను కనెక్ట్ చేయాలని కోరారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ సగటు ధర చదరపు అడుగుకు రూ.6200 నుంచి రూ.6,400 వరకు ఉండగా.. నార్త్ హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలతో కూడిన అపార్ట్ మెంట్ చదరపు అడుగు రూ.5 వేలకే దొరుకుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కనెక్టివిటీ పెరిగి రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున.. ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం అని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

This website uses cookies.