భవన అనుమతులకు సంబంధించి ప్రభుత్వం 2020లో ప్రారంభించిన టీఎస్ బీపాస్ వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీకి) కాసుల పంట పండిస్తోంది. ఇప్పటివరకు టీఎస్ బీపాస్ కింద 32,391 భవనాలకు అనుమతులు ఇవ్వగా.. అందులో దాదాపు 10వేల అనుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినవే కావడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. ఆస్తి పన్ను తర్వాత జీహెచ్ఎంసీకి టీఎస్ బీపాస్ నుంచే అధిక ఆదాయం వస్తోంది. గతేడాది టీఎస్ బీపాస్ ద్వారా రూ.1144 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటివకు రూ.650 కోట్ల ఆదాయం చేకూరింది.
ఈ ఏడాది గతేడాది ఆదాయాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని యూఎల్బీలతో పోలిస్తే భవన అనుమతులు ఇచ్చే విషయంలో జీహెచ్ఎంసీ టాప్ లో ఉంది. భవన నిర్మాణాలకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం టీఎస్ బీపాస్ తీసుకొచ్చింది. దీని ప్రకారం 75 చదరపు గజాల వరకు స్థలంలో జీ ప్లస్ 1 ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతీ అవసరం లేదు. 10 మీటర్ల ఎత్తులో 500 చదరపు మీటర్ల వరకు స్థలంలో భవన నిర్మాణానికి ఆన్ లైన్ స్వీయ ధ్రువీకరణ ద్వారా 15 రోజుల్లో అనుమతి మంజూరు చేస్తారు. ఇక 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన, 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో భవన నిర్మాణాలకు సింగిల్ విండో వ్యవస్థ ద్వారా 21 రోజుల్లో అనుమతి ఇస్తారు.
This website uses cookies.