Categories: TOP STORIES

బీచ్.. మీ వాకిట్లోకే వచ్చేస్తుంది

క్రిస్టల్ లాగూన్స్ సరికొత్త సాంకేతికతతో సాకారం

ప్రపంచవ్యాప్తంలో పలు నగరాల్లో మానవ నిర్మిత బీచ్ లు

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు

ఉదయం లేవగానే బీచ్ కనిపించేలా ఉన్న ఫ్లాట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలాంటి బీచ్ వ్యూ ఫ్లాట్లకు గిరాకీ మామూలుగా ఉండదు. ముంబై వంటి మహానగరాల్లో అయితే వాటి ఖరీదు చుక్కలను తాకుతున్నాయి. తీరప్రాంతం ఉన్న నగరాల్లో మాత్రమే సీ వ్యూ, బీచ్ వ్యూ ఫ్లాట్లు ఉంటాయి. కానీ మన తెలంగాణలో అసలు సముద్రమే లేదు. మరి మనం బీచ్ వ్యూ ఫ్లాట్ తీసుకోవాలంటే అటు ముంబైకో, ఇటు వైజాగ్ కో వెళ్లాల్సిందేనా? అస్సలు అవసరం లేదంటోంది చాంఫియన్ ఇన్ ఫ్రా టెక్ సంస్థ. మీరు బీచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీచ్ నే మీ వాకిట్లోకి తీసుకొస్తామని చెబుతోంది. మీకు ఎక్కడ ఎలా కావాలంటే అలాంటి బీచ్ ను మీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తామని అంటోంది. అనడమే కాదు.. ప్రపంచవ్యాప్తంలో పలు నగరాల్లో చేసి చూపించింది కూడా.

అచ్చం బీచ్ లాగానే..

సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లలో స్విమింగ్ పూల్స్ ఉంటాయి. కానీ బీచ్ వాతావరణం ఏం చేసినా రాదు. ఈ నేపథ్యంలో క్రిస్టల్ చాంఫియన్ సంస్థ క్రిస్టల్ లాగూన్స్ పేరుతో కృత్రిమ బీచ్ ను నిర్మించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఎంత పరిమాణంలో ఎలా కావాలంటే అలాంటి డిజైన్ లో సహజ మడుగులను తలపించే నీటి కొలనులను సృష్టిస్తోంది. నీలిరంగు నీళ్లు.. చుట్టూ ఇసుక, అక్కడక్కడా బీచ్ లో ఉండే మొక్కలు.. మొత్తంగా చూస్తే అచ్చం బీచ్ లాగానే అనిపిస్తుంది. నిజమైన బీచ్ లో మనం ఉన్నామనే భావన కలగజేస్తుంది. పైగా తక్కువ నీటి వినియోగం, తక్కువ శక్తి, తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించి.. నిర్వహిస్తోంది. వినోద కార్యకలాపాలకు, నీటి క్రీడలకు చాలా అనువైన విధంగా వీటిని రూపొందిస్తోంది. దీంతో వీటికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. మన చెంతకే బీచ్ తెచ్చుకోవాలని కోరుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

నిర్మాణ, నిర్వహణ చౌకే..

తక్కువ ఖర్చుతో నిర్మించే ఈ మ్యాన్ మేడ్ బీచ్ ల నిర్వహణ వ్యయం కూడా తక్కువే. సంప్రదాయ స్విమింగ్ పూల్ లో నీటిని శుద్ది చేయడానికి అవసరమయ్యే రసాయనాల కంటే 100 రెట్లు తక్కువ రసాయనాలు సరిపోతాయి. అలాంటి సాంకేతికతతో వీటిని రూపొందిస్తున్నారు. క్రిస్టల్ లాగూన్స్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతకు పేటెంట్ కూడా ఉంది. స్థానిక నియంత్రణ అవసరాలకు అనుగుణంగా వివిధ నీటి నాణ్యత ప్రమాణాలను ఇవి కలిగి ఉంటాయి. అలాగే మాలిక్యులర్ ఫిల్మ్ టెక్నాలజీ ద్వారా అవసరమైనప్పుడు నీటి వినియోగాన్ని అదనంగా 50 శాతం తగ్గించొచ్చు. సంప్రదాయిక కేంద్రీకృత స్విమ్మింగ్ పూల్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌లతో పోలిస్తే 2 శాతం శక్తిని మాత్రమే ఉపయోగించే సమర్థవంతమైన వడపోత వ్యవస్థను క్రిస్టల్ లాగూన్స్ సాంకేతికత కలిగి ఉండటం విశేషం. క్రిస్టల్ లాగూన్స్ పేటెంట్ పొందిన సొల్యూషన్ నీటిలో సురక్షితమైన సంకలనాలు, విభిన్న అల్ట్రాసోనిక్ తరంగాలను వర్తింపజేస్తుంది. దీని వల్ల కలుషిత కణాలు పెద్ద కణాలుగా కలిసిపోతాయి. అనంతరం వీటిని అందులో నుంచి సులభంగా తొలగించవచ్చు. పైగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టల్ లాగూన్స్ సాంకేతికతతో రూపొందిన అన్ని బీచ్ లను క్రిస్టల్ లాగూన్స్ కంట్రోల్ సెంటర్ నుంచి 24 గంటలూ పర్యవేక్షిస్తారు. ఆయా ప్రదేశాల్లో అవసరాలకు తగినట్టుగా నియంత్రిస్తారు.

బిల్డర్లకూ లాభమే..

మానవ నిర్మిత బీచ్ లు ఏర్పాటు చేయడం వల్ల బిల్డర్లకూ లాభమే. ప్రాజెక్టులో ఎన్ని సౌకర్యాలు ఉంటే దానికి అంత డిమాండ్ పెరుగుతుందనేది ఎవరూ కాదనలేని అంశం. అలాంటి ఎక్కడా లేనివిధంగా బీచ్ నే ప్రాజెక్టులో చేరిస్తే దాని విలువ పెరుగుతుంది. ఫలితంగా ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని చాంపియన్ ఇన్ ఫ్రాటెక్ చైర్మన్ సుభాకర్ రావు సూరపనేని చెబుతున్నారు. సిడ్నీలో జరుగుతున్న క్రెడాయ్ నాట్ కాన్ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీ విలువ ఎలా ఉంటుందనేది విశదీకరించారు. ఈ మానవ నిర్మిత బీచ్ లు గోల్ఫ్ కోర్సు కంటే నాలుగు రెట్లు తక్కువ నీటిని వినియోగిస్తాయని.. అంతే పరిమాణం కలిగిన పార్కు కంటే సగం నీళ్లు సరిపోతాయని పేర్కొన్నారు. ఈ అందమైన బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీలు రియల్ ఎస్టేట్ ల్యాండ్ స్కేప్ ను మరింత పెంపొందించడంతోపాటు ఏడాది పొడవునా గమ్యస్థానంగా మారుస్తాయని వివరించారు. లోతట్టు ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఎక్కడైనా ఎంత పరిమాణంలోనైనా వీటిని నిర్మించొచ్చని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చెరువులు, సరస్సులకు ఆనుకుని ఉన్న ఇళ్లపై హైడ్రా కొరడా ఝలిపిస్తున్న నేపథ్యంలో.. బీచ్ ఒడ్డున జీవనం సాగించాలని కోరుకునే నగరవాసులకు క్రిస్టల్ లాగూన్స్ ఓ అద్భుతమైన ప్రత్యామ్నాయం అనడంతో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాం

క్రెడాయ్ నాట్ కాన్ సదస్సులో మా స్టాల్ కు భారతదేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది బిల్డర్లు కూడా క్రిస్టల్ లాగూన్స్ పట్ల ఆసక్తి కనబరిచారు. తమ ప్రాజెక్టుల్లో మానవ నిర్మిత బీచ్ లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే భారత్ లోని ప్రతి నగరంలో మా బీచ్ లు మీకు కనిపిస్తాయి.

సుభాకరరావు సూరపనేని, చాంపియన్ ఇన్ ఫ్రా టెక్ చైర్మన్

This website uses cookies.