- షారుక్ ఖాన్ నివాసం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయనకు సంబంధించిన అంశాలను ఆసక్తిగా తెలుసుకుంటారు. షారుక్ ఇంటి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన్నత్ అని పేరు పెట్టుకున్న ఆ సౌధం హెరిటేజ్ బంగ్లా. తాజాగా మన్నత్ అనుబంధ భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మించాలని షారుక్ కుటుంబం నిర్ణయం తీసుకుని అందుకోసం ఆయన భార్య గౌరీ ఖాన్ అనుమతి కోరడంతో మన్నత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మన్నత్ గురించి మరికొన్ని సంగతులు తెలుసుకుందామా?
మన్నత్ భవనం ముంబై బాంద్రాలోని నాగరిక బ్యాండ్ స్టాండ్ ప్రాంతంలో ఉంది. 27వేల చదరపు అడుగుల ఈ హెరిటేజ్ బంగ్లాను షారుక్ ఖాన్ 20101లో రూ.13.01 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాని విలువ రూ.200 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మన్నత్ బంగ్లా అసలు పేరు.. ‘విల్లా వియన్నా’. షారుక్ ఖాన్ ఆ బంగ్లాను బాయి ఖోర్షెడ్ భాను సంజన ట్రస్ట్ నుంచి 2001లో కొనుగోలు చేశారు. తొలుత దాని పేరును జన్నత్ అని పెట్టారు. జన్నత్ అంటే స్వర్గం అని అర్ధం. అయితే, మన్నత్ అని మారిస్తే తనకు ఇంకా అదృష్టమని భావించి 2005లో పేరు మార్చారు. మన్నత్ అంటే ప్రార్ధన అని అర్థం. ఈద్ లేదా షారుక్ పుట్టినరోజు వంటి సందర్భాలలో ‘బాద్‌షా’ని చూసేందుకు అభిమానులు మన్నత్ బయట గుమిగూడడంతో ఇది పర్యాటక ఆకర్షణగా మారింది.
మన్నత్ చరిత్ర ఇదీ..
మన్నత్ చరిత్ర 1914 నాటిది. నారిమన్ ఎ దుబాష్ అనే వ్యక్తి దీని యజమాని. అనంతరం దీనిని గ్రేడ్-3 హెరిటేజ్ ప్రాపర్టీగా వర్గీకరించారు. అంటే ఈ బంగ్లాలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు ఉండదు. ఈ నేపథ్యంలో షారుక్ ఈ బంగ్లాను కొనుగోలు చేసినప్పటికీ, దానిని మార్చుకోవడానికి వీలు కపోవడం వల్ల దీని వెనుక ఆరు అంతస్తుల ఇంటిని నిర్మించారు. దీనిని మన్నత్ అనెక్స్ అని పిలుస్తారు. అయితే, మన్నత్ ను 19వ శతాబ్దంలో మండి రాజు నిర్మించాడనే వాదన కూడా ఉంది. అంతేకాకుండా 1917లో దీనిని మనెక్ జీ బాటిల్ వాలా అనే పార్సీ వ్యక్తి నిర్మించారని కూడా అంటారు.
ఈ బంగ్లా రూపకల్పన విల్లా లా రోటుండా అనే 16వ శతాబ్దపు భవనం నుంచి ప్రేరణ పొందింది. ఇంటి వెలుపల వెనుక వైపు ఎత్తైన గేటు, ఎత్తైన కంచెలతో సరిహద్దు గోడలు ఉంటాయి. అలాగే ఓ ఫలకంపై ‘మన్నత్ ల్యాండ్స్ ఎండ్‘ అని ఉంటుంది. షారుక్ కి మన్నత్ అంటే చాలా ఇష్టం. తాను అన్నీ పొగొట్టుకని ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చినా.. మన్నత్ ను మాత్రం అమ్మబోనని చెప్పారు. ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ షారుక్ ఖాన్ అనే డాక్యుమెంటరీలో మన్నత్ గురించి మాట్లాడారు. ‘ఈ ఇల్లు కొనడం నా జీవితంలో చేసిన కష్టతరమైన పనులలో ఒకటి. నా తల్లిదండ్రులు మరణించిన తర్వాత నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లంటే చాలా ఇష్టం. నాకు ఇల్లు ఉండాలనే కాంక్ష బాగా ఎక్కువ. నాకు పిల్లలు పుట్టేసరికి ఈ ఇల్లు కొనగలిగాను. ఇది మా కుటుంబానికి చెందిన ఇల్లు. ఏదో ఒకరోజు నా మునిమనవళ్లు కూడా ఓ పాత పార్సీ కుటుంబంలా ఇక్కడ నివసిస్తారు’ అని పేర్కొన్నారు.
డబ్బుల్లేక ఇబ్బందులు..
2023లో షారుక్ ఖాన్ ముంబైలో తన భార్య గౌరీ ఖాన్ పుస్తకం మై లైఫ్ ఇన్ డిజైన్ ని ఆవిష్కరించిన సందర్భంగా మరోసారి మన్నత్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వాస్తవానికి మన్నత్ ను కొనుగోలు చేయడం తమ బడ్జెట్ కు మించిన పని అని.. అయినప్పటికీ విలువైన బంగ్లాను కొనుగోలు చేశామని చెప్పారు. అయితే, దానిని అందంగా అలంకరించడానికి అప్పట్లో తమ వద్ద డబ్బుల్లేవన్నారు. ఇందుకోసం ఓ డిజైనర్ ను పిలవగా.. ఆయన చెప్పిన బడ్జెట్ తన నెల సంపాదన కంటే ఎక్కువ అని వివరించారు. దీంతో తమ ఇంటిని అలంకరించే బాధ్యతను గౌరీకే అప్పగించినట్టు చెప్పారు. అలా ఇరువురూ కలిసి కావాల్సిన వస్తువులు కొంటూ ఇంటిని అలంకరించారు. ఓసారి డబ్బులు తక్కువగా ఉండటంతో లెదర్ సోఫాలు కొన్నామని పేర్కొన్నారు.