అతను క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్. గతంలో సంఘంలో సభ్యుడిగా కూడా పని చేశాడు. అందులో నుంచి బయటికొచ్చాక ప్రీలాంచ్ దందా షురూ చేశాడు. మరి, క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సంతకం పెట్టిన తర్వాత.. ఇలా ప్రీలాంచుల్ని చేయవచ్చా? క్రెడాయ్ ప్రాథమిక నిబంధనకే తూట్లు పొడిచే ఇలాంటి బిల్డర్లపై చర్యలు తీసుకోకుండా.. క్రెడాయ్ హైదరాబాద్ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది? క్రెడాయ్ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు? క్రెడాయ్ బ్రాండ్ ఇమేజ్‌కి తూట్లు పొడిచే ఇలాంటి బిల్డర్లను ఎందుకు తొలగించట్లేదు? కొంతమంది తప్పుల వల్ల క్రెడాయ్ ప్రతిష్ఠకు మసకబారిపోయినా ఫర్వాలేదా? అసలు ముందునుంచీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. అసలీ ప్రీలాంచ్ దందాలే హైదరాబాద్‌లో ఉండేవి కాదు కదా!
మూసాపేట్ రోడ్డులో ప్రప్రథమంగా ఆకాశహర్మ్యాల్ని నిర్మించిన సదరు క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్.. సుమారు 12 ఎకరాల్లో పద్నాలుగు వందలకు పైగా ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించాడు. ఎలాగూ కొత్త నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతుల్ని మంజూరు చేయట్లేదు. అందుకేనేమో ఈ ఆరు టవర్లకు సంబంధించిన డ్రాయింగ్స్ సిద్ధం చేసి.. మూడు టవర్లను ప్రీలాంచ్ అమ్మకానికి పెట్టాడు. పదమూడు వందల చదరపు అడుగుల్లో ఆరంభమయ్యే 2 బీహెచ్‌కే కొనేందుకు తొలుత పది లక్షలు అడ్వాన్సు కట్టి.. ఈ మార్చి 31 లోపు మిగతా సొమ్ముని పూర్తి కట్టేయాలట. పదకొండో అంతస్తు నుంచి చదరపు అడుక్కీ రూ.15 ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రెరా అప్రూవల్స్ వచ్చాక.. ప్రాజెక్టును లాంచ్ చేస్తామని సంస్థ చెబుతోంది.
ఒకవైపు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. ప్రీలాంచులు, యూడీఎస్ స్కీములతో హైదరాబాద్ నిర్మాణ రంగం అతలాకుతలం అవుతుంటే.. క్రెడాయ్ హైదరాబాద్ మాత్రం ఏడాదికో ప్రాపర్టీ షోను నిర్వహిస్తూ ఎంచక్కా కాలం గడిపేస్తోంది. సంఘ సభ్యుల ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించుకోవడానికి ఈ షోను ఏటా నిర్వహిస్తూ.. తామీ సమాజానికెంతో గొప్ప మేలు చేస్తున్నామనే రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాకపోతే, గత మూడు, నాలుగేళ్ల నుంచి ప్రాపర్టీ షోలను గమనిస్తే.. ఈ ప్రాపర్టీ షోలకూ పెద్దగా ప్రాస్పెక్టీవ్ బయ్యర్లు హాజరు కావట్లేదు. ఎందుకంటే, ఇక్కడికొస్తే చదరపు అడుక్కీ రూ.7 వేల నుంచి 15 వేల దాకా పెట్టాలి. అదే బయట ప్రీలాంచుల్లో అయితే.. అందులో సగం రేటుకే ఫ్లాట్లు వచ్చేస్తున్నాయి. ఒక క్రెడాయ్ బిల్డర్ రెరా ఫ్లాట్లను ఎక్కువ ధరకు అమ్ముతుంటే.. మరో రెరా బిల్డర్ రెరా లేకుండానే రూ.4 వేల నుంచి 6 వేలకు విక్రయిస్తున్నాడు. ఉదాహరణకు, అరబిందో రియాల్టీ అనే సంస్థ రెరా తీసుకుని.. మాదాపూర్‌లో పక్కా అనుమతులతో కొహీనూర్, పర్ల్ పేరిట ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తోంది. చదరపు అడుక్కీ రూ.12000కు అటుఇటుగా ఫ్లాట్లను విక్రయిస్తోంది. ఈ ప్రాజెక్టుకు మూడు కిలోమీటర్ల దూరంలోని మూసాపేట్‌లో.. మరొక క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్.. రెరా లేకుండా.. చదరపు అడుక్కీ రూ.5500కే ప్రీలాంచ్‌లో.. హండ్రెడ్ పర్సంట్ స్కీమ్ కింద.. ఫ్లాట్లను విక్రయిస్తున్నాడు.
రెరాలెస్ మరొకరు
కస్టమర్ల కోణంలో ఆలోచిస్తే.. ఎవరైనా ప్రీలాంచులోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపెడతారు కదా! మరెందుకు, అరబిందో రియాల్టీ వద్ద అధిక ధర పెట్టి ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు? ఇది కేవలం ఈ ఒక్క బిల్డర్ సమస్యే కాదు.. అధిక శాతం హైదరాబాద్ డెవలపర్లు.. రెరా అనుమతి తీసుకోకుండా ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రీలాంచులు చేయకూడదని నిర్ణయించుకున్న బిల్డర్లు.. పోటీలో వెనకపడిపోవడం గమనార్హం. ఇక్కడ రెండు సంస్థలూ క్రెడాయ్ హైదరాబాద్‌లో సభ్యులు కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, క్రెడాయ్ హైదరాబాద్ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి? ప్రీలాంచులకు అడ్డుకట్ట వేయాలా? వద్దా? అలా కాకుండా, మీరేమైనా చేసుకోండి.. మేం మాత్రం ప్రాపర్టీ షోలను నిర్వహిస్తాం.. అందులో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలని చెప్పటం కరెక్టేనా? లేకపోతే, ఒక పెద్దన్న తరహాలో ఆలోచించి.. ప్రీలాంచులకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారిస్తారా? లేదా?
This website uses cookies.