హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ సానుకూల వాతావరణంలో దూసుకెళ్తోంది. ఫిబ్రవరిలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు అదరగొట్టింది. ఈనెలలో భాగ్యనగరంలో 6,938 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 21 శాతం మేర పెరుగుదల నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. అలాగే ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరి రిజిస్ట్రేషన్లు 27 శాతం మేర పెరిగాయి. అధిక ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు నివేదికలో తేలింది. ఎప్పటిలాగే రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్యలో ధర కలిగిన ఇళ్ల అమ్మకాల హవా కొనసాగింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి 45 శాతం ఉంది. అయితే, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు కాస్త పెరిగాయి.
2023 ఫిబ్రవరిలో వీటి వాటా 10 శాతం ఉండగా.. 2024 ఫిబ్రవరిలో ఇవి 14 శాతానికి పెరిగాయి. ఇళ్ల పరిమాణాల్లో కూడా కొనుగోలుదారుల ప్రాధాన్యం మారుతోంది. వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల మధ్యలో ఉన్న ఇళ్లకే డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, గతం కంటే కాస్త పెద్ద ఇళ్ల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 71 శాతంగా ఉంది. వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. గతేడాది వీటి వాటా 20 శాతం ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16 శాతానికి తగ్గింది. 2వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల అమ్మకాలు కాస్త పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో వీటా వాటా 10 శాతం ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 13 శాతానికి పెరిగింది.
This website uses cookies.