ఇక తెలంగాణలో భూ వివాదాలకు తెరపడనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మునిసిపాలిటీలు, పట్టణాల్లో నక్షాను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తెలంగాణలోని ఎనిమిది పట్టణాల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద నక్షా సర్వే ను చేపతున్నాయి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు. భవిష్యత్తులో రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీల్లో సర్వే నిర్వహించి నక్షాను ఫిక్స్ చేసి ప్రాపర్టీ కార్డులను జారీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు అధికారులు. దీంతో రానున్న రోజుల్లో భూ వివాదాలకు తెరపడనుండటంతో పాటు సులభంగా బ్యాంకు రుణాలు పొందవచ్చని రియల్ రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు.
తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సాగు భూములకు పక్కాగా ఉండే నక్షా తరహాలోనే నగరాలు, పట్టణాలకు కూడా నక్షా రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు పైలట్ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో నక్షా రూపొందించేందుకు గత నెల సెప్టెంబర్ లో నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పథకం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్-ఎన్‌ఏకేఎస్‌హెచ్‌ఏ-నక్షా కింద పట్టణాలకు నక్షాలను రూపొందించే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ముందు రాష్ట్రంలో ఎంపిక చేసిన పట్టణాల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్లతో ఛాయాచిత్రాలు రూపొందిస్తోంది. ఆ తరువాత వాటి పరిశీలన పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలోని మొత్తం ఎనిమిది పట్టణాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఎనిమిది ముసినిపాలిటీల్లో సమగ్ర సర్వే నిర్వహించి, పూర్తిస్థాయి వివరాలతో మ్యాప్ లను రూపొందించనున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, మునిసిపాలిటీ, రెవెన్యూ శాఖ, ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ శాఖలు సంయుక్తంగా ఈ పైలెట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నాయి. నక్షా పథకంలో ప్రతి ఇల్లు, ఆస్తిని పక్కాగా సర్వే చేయనున్నారు. అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులు గుర్తించి.. వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. అనంతరం ప్రతి ఇల్లు లేదా ఆస్తికి ప్రాపర్టీ కార్డులను జారీ చేస్తారు. దీనివల్ల ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని ఆస్తులు, ఇళ్ల విలువ పెరగనుందని అధికారులు చెబుతున్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రాపర్టీ కార్డులు అందించడం వల్ల బ్యాంకు రుణాలు పొందేందుకూ వీలు కలగనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా నగరాలు, మునిసిపాలిటీల్లోని మురికివాడలు, బస్తీలు, కాలనీల్లోని చిన్న చిన్న ఇళ్లు, స్థలాలకూ మ్యాప్ లు, నక్షాలు సిద్ధం కానున్నాయి. ఈ యేడాది డిసెంబరు నాటికి పైలట్ సర్వే పూర్తి చేసే అవకాశాలున్నాయని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. తెలంగాణలోని 142 పట్టణాల్లోనూ మున్ముందు నక్షా సర్వే చేపట్టాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. నక్షా సర్వేలో ప్రభుత్వ స్థలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ నాలాలు, చెత్త డంపింగ్ ప్రదేశాలు, నీటి వనరుల విస్తీర్ణాల కొలతలు పక్కాగా తేలనున్నాయి. ఈ క్రమంలో వాటి హద్దులనూ గుర్తించనున్నారు. పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాల గుర్తింపు అనంతరం అవి ల్యాండ్ బ్యాంక్ గా ఉపయోగపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ కసరత్తు తరువాత భూ ఆక్రమణలూ తేలనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. నక్షా సర్వే ద్వారా చిన్న చిన్న పట్టణాల్లోని ఆక్రమణలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు, జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, మహబూబాబాద్ పట్టణాల్లో న౭ా సర్వే చేపడుతున్నారు. ఈ ఎనిమిది పట్టణాల్లో మొత్తం 200 చదరపు కిలోమీటర్ల మేర నక్షా సర్వే చేయనున్నారని అధికారులు తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా పూర్తైన తరువాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 142 మునిసిపాలిటీల్లో మొత్తం 6 వేల చదరపు కిలోమీటర్ల మేర నక్షా సర్వే నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇలా సమగ్ర భూ నక్షా సర్వే చేయడం, ద్వార భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ప్రభుత్వం ప్రాపర్టీ కార్డుల జారీ ద్వార న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా ఈజీగా బ్యాంకు రుణాలు పొందవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
This website uses cookies.